PawanKalyan: అభిమానికి మాట.. 24 గంటల్లోనే ట్యాబ్, పప్పీని పంపిన పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 19 , 2026 | 06:55 AM
అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పొనుగోటి నిరంజన్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం స్వయంగా వెళ్లి కలిసిన విషయం తెలిసిందే.
అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పొనుగోటి నిరంజన్ (Niranjan)ను స్వయంగా వచ్చి కలిసిన జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అతడు అడిగిన కోరికలను కూడా గంటల వ్యవధిలోనే తీర్చేశారు. బుధవారం హనుమకొండలోని తమ ఇంటికి పరామర్శించడానికి వచ్చిన పవన్‌ను ఆడుకోడానికి ఒక కుక్క పిల్ల (పప్పీ)తో పాటు వీడియోలు, సినిమాలు చూడడానికి ఒక ట్యాబ్ కావాలని నిరంజన్ అడిగాడు.
అప్పటికప్పుడు స్పందించిన పవన్.. వాటిని తెప్పించాలని తన పీఏ, పీఆర్వోతో పాటు టీం సభ్యులను ఆదేశించారు. దీంతో పవన్ టీం సభ్యులు, జనసేన కార్యకర్తలు వినయ్, పృథ్వీలు హైదరాబాద్ డాగ్ ఫాంలో అత్యంత ఖరీ దైన లాసా అప్సో జాతికి చెందిన ఒక కుక్క పిల్లతో పాటు సామ్‌సంగ్ కంపెనీకి సంబంధించిన ట్యాబ్‌నుతీసుకుని బుధవారం హనుమకొండకు చేరుకున్నారు. గురువారం తల్లి దండ్రులు రాంగోపాలచారి-మానస, చెల్లి రక్షిత చేతుల మీదుగా వాటిని నిరంజన్‌కు అందించారు. అడిగిన వెంటనే బహుమతులు పంపిన పవన్‌కు నిరంజన్, అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.