పావలా శ్యామల చావుకు చిరంజీవినే కారణం..
ABN , Publish Date - Jul 29 , 2026 | 03:13 PM
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. ఇండస్ట్రీలో ఏది జరిగినా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి లింక్ పెట్టడం కొందరికి ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. ఇండస్ట్రీలో ఏది జరిగినా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి లింక్ పెట్టడం కొందరికి ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Shyamala) గుండెపోటుతో మరణిస్తే, దానికి కారణం కూడా చిరంజీవినే అంటూ ఆమె కూతురు తీవ్ర స్థాయిలో నిందలు వేయడం టాలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. అసలు ఎలాంటి సంబంధం లేని విషయాన్ని మెగాస్టార్‌పైకి నెట్టివేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ పావలా శ్యామల కన్నుమూసిన విషయం తెల్సిందే. గతంలో ఆమె ఆర్ధిక ఇబ్బంది తెలుసుకొని చాలామంది స్టార్స్ ఆదుకున్నారు. అందులో ఎక్కువ మెగా ఫ్యామిలీనే ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్.. ఇలా అందరూ పావలా శ్యామలకు ఆర్ధిక సాయం చేసినవారే. అంత చేసినా కూడా ఆమె కుమార్తె మీడియా ముందుకు వచ్చి చిరంజీవి తమకు తగినంత సహాయం చేయలేదని, ఆయన వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆరోపణలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి, దిల్ రాజు లాంటివారు తన తల్లిని పట్టించుకోని ఉంటే ఆమె మరణించేది కాదని ఆమె ఆరోపించింది.
అయితే ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పావలా శ్యామల కష్టాల్లో ఉన్నప్పుడు పదే పదే లక్షలాది రూపాయల ఆర్థిక సాయం అందించడమే కాకుండా మా(MAA) అసోసియేషన్ ద్వారా కూడా పెన్షన్ అందేలా చేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఆమె వయస్సు 75. ఆరోగ్య సమస్యలతో పావలా శ్యామల మరణిస్తే.. దానికి పరిశ్రమలో అందరికీ అండగా నిలిచే చిరంజీవిని బాధ్యుడిని చేయడం ఎంతవరకు న్యాయమని, నిజానికి ఆపదలో ఉన్న ప్రతి నటుడికి సహాయం అందించే చిరంజీవిపై ఇలాంటి నిందలు వేయడం విచారకరమని, కేవలం ప్రచారం కోసమే ఆయన పేరును వాడుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇంకొంతమంది పావలా శ్యామల కూతురు వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కోరుతున్నారు. తల్లి పోయిన బాధ.. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఏదేదో మాట్లాడుతుందని చెప్పుకొస్తున్నారు. మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలను తీసుకొని మెగా ఫ్యామిలీపై నెగిటివ్ ప్రచారం చేయవద్దని కోరారు. మరి ఈ ఆరోపణలపై ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.