మా హక్కును.. లాగేసుకున్నారు! వెంటనే ఆ జీవోను రద్దు చేయండి.. తెలంగాణ సీఎంకు ఎగ్జిబిటర్ల లేఖ
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:58 PM
సినిమా టికెట్ ధరలను సవరిస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
తెలంగాణలో (Telangana) సినిమా టికెట్ ధరలను (Movie Ticket Prices) సవరిస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 (Telangana GO 77) నిర్మాతలకు అనుకూలంగా ఉందని, దాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ (Telangana Exhibitors Association) డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి అసోసియేషన్ ఓ లేఖ రాసింది.
‘తెలంగాణలోని 33 జిల్లాల్లో ఉన్న 400కు పైగా థియేటర్లను సంప్రదించకుండా ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమేయం లేకుండా జీవోను విడుదల చేశారు. తెలంగాణలో 400కు పైగా సింగిల్ థియేటర్లు ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో 99 శాతం ఎయిర్‌కూల్డ్ థియేటర్లే ఉన్నాయి.
కోవిడ్ తర్వాత భారీగా పెట్టుబడి పెట్టి ఆధునీకరించాం. రిక్లైనర్స్, డాల్బీ అట్మాస్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. ఈ థియేటర్లపై ఆధారపడి 20 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సొంత ఆస్తికి టికెట్ ధరలను నిర్ణయించుకునే హక్కును ఈ జీవోతో లాక్కున్నారు. థియేటర్ల ఆర్థిక భారమంతా ఎగ్జిబిటర్లపైనే ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిర్మాతలకు అనుకూలంగా, ఏకపక్ష నిర్ణయంలా ఉంది’ అని ఆ లేఖలో ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు.