MM Keeravani: అరుదైన ఘనత సాధించిన కీరవాణి..

ABN , Publish Date - Jan 19 , 2026 | 08:18 PM

ఆస్కార్ అవార్డుతో తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సంగీత మాంత్రికుడు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani). ఇప్పటికే లైఫ్ టైం అచీవ్ మెంట్లతో దూసుకుపోతున్న ఆయన. . మరో గోల్డెన్ ఛాన్స్ ను దక్కించుకున్నారు.

MM Keeravani

MM Keeravani: ఆస్కార్ అవార్డుతో తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సంగీత మాంత్రికుడు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani). ఇప్పటికే లైఫ్ టైం అచీవ్ మెంట్లతో దూసుకుపోతున్న ఆయన. . మరో గోల్డెన్ ఛాన్స్ ను దక్కించుకున్నారు. ఈసారి జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమ్రోగబోతుంది. ఆస్కార్ సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణికు మరో గర్వకారణమైన గుర్తింపు దక్కింది.

భారత జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంలో అరుదైన అవకాశం వచ్చింది. 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఆయన సంగీతం అందించబోతున్నారు. కర్తవ్య పథ్‌పై జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 2,500 మంది కళాకారులు పాల్గొననున్నారు. విభిన్న రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలను ఒకే స్వరంలో ఆవిష్కరించేలా రూపొందే ఈ మహా ప్రదర్శనలో కీరవాణి స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తనదైన ప్రత్యేక శైలిలో ‘వందేమాతరం’ను మరింత ఉత్కంఠభరితంగా , ఆధునిక స్పర్శతో పాటే సాంప్రదాయ వైభవాన్ని కాపాడుతూ స్వరపరచాలని ఆయన భావిస్తున్నారు.

తనకు వచ్చిన ఈ అరుదైన అవకాశం పట్ల కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు. దేశభక్తి భావనలను మరింత గాఢంగా రగిలించేలా ఈ సంగీత ప్రదర్శన ఉండనుందని ఆయన సూచించారు. మొత్తానికి ‘RRR’ చిత్రంతో ప్రపంచాన్ని ఆకట్టుకుని.. ‘నాటు నాటు’తో ఆస్కార్ అందుకున్న కీరవాణి... ఇప్పుడు జాతీయ వేదికపై దేశభక్తి స్వరాలతో మరో చరిత్ర సృష్టించబోతున్నారు. జనవరి 26న కర్తవ్య పథ్‌పై ఈ చారిత్రాత్మక క్షణానికి సిద్ధమవుతున్న కీరవాణి... తెలుగు ప్రతిభను మళ్లీ జాతీయ స్థాయిలో గర్వంగా నిలబెట్టబోతున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 09:28 PM