మరోసారి నందమూరి తమన్.. అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం
ABN , Publish Date - Apr 14 , 2026 | 08:21 PM
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK 111'. 'అఖండ-2' తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నందమూరి బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK 111'. 'అఖండ-2' తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే ఊపుతో ఇప్పుడు మరో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayantara) నటిస్తుండటం విశేషం. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. వీరిద్దరూ వెండితెరపై కనిపించినప్పుడల్లా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు వచ్చాయి. ఈ సక్సెస్ ఫుల్ జోడీ మరోసారి జతకట్టడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. ఈ కొత్త సినిమాలో కూడా వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం భావిస్తోంది.
మ్యూజిక్ సెన్సేషన్ థమన్ (Thaman S)ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉంటూ, ఇప్పటికే రెండు అదిరిపోయే ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఒక పవర్‌ఫుల్ సాంగ్‌కు ప్రముఖ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ సాంగ్ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. పాటతో పాటు అదే లొకేషన్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాలయ్య చెప్పే పదునైన డైలాగులు, గోపీచంద్ మలినేని అందించే మాస్ ఎలివేషన్లు ఈ సినిమాలో పీక్స్‌లో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గోపీచంద్ మలినేని తనదైన శైలిలో ఈ స్క్రిప్ట్‌ను పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దారట. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసినట్లు సమాచారం. చిత్ర యూనిట్ షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా ప్లాన్ చేస్తూ, త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. మరి బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ ఈసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.