మ‌రోసారి మాన‌వ‌త్వం చాటుకున్న‌ చిరంజీవి.. ర‌మేశ్ ఫ్యామిలీకి చెక్కు అంద‌జేత‌

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:49 AM

తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

Chiranjeevi

తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవ‌ల బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్ప‌త్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ (Gabbar Singh Ramesh) కుటుంబానికి అండగా నిలిచారు. వివ‌రాల్లోకి వెళితే ..‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విష‌యం తెలుసుకున్న ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్, ప‌వ‌న్ క‌ల్యాణ్ టీం స్వ‌యంగా ఆస్ప‌త్రికి వెళ్లి ర‌మేశ్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. వైద్యులను అడిగి హెల్త్ కండీష‌న్ గురించి తెలుసుకున్నారు.

ఈ క్ర‌మంలోనే విషయం తెలుసుకున్న చిరంజీవి గారు వెంటనే స్పందించారు. అపోలో ఆసుపత్రి డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడి రమేష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల‌ని చిరంజీవి కోరారు. ఆపై రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఆయన సతీమణికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని చిరంజీవి కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వ‌డంతో పాటు రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి గారు ఆకాంక్షించారు.

Chiranjeevi

ఇదిలాఉంటే.. నిన్న మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు సైతం రూ.2 లక్షల చెక్కును అందించి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ తాజా ఘ‌ట‌న‌ల‌తో త‌మ‌ను న‌మ్ముకున్న వారిని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌ని మెగా బ్ర‌ద‌ర్స్ చాటి చెప్పారు. ఎన్నో సందర్భాల్లో అవసరం ఏర్ప‌డిన ప్ర‌తీసారి అడ‌గ‌కున్నా మేమున్నాం అంటూ మెగా ఫ్యామిలీ ఆప‌న్న‌హ‌స్తం అందిస్తూ సినీ కార్మికులు, నటీనటులకు చేదోడు వాదోడుగా ఉండ‌డంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

Updated Date - Jul 26 , 2026 | 12:27 PM