ఈ సినిమాకు.. సాయికుమార్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
ABN , Publish Date - Mar 27 , 2026 | 07:31 AM
ఈ చిత్రంలో సుయోధన పాత్రకు సాయికుమార్ గారు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఆయన అంత బాగా నటించారని ప్రియదర్శి అన్నారు.
‘ఈ చిత్రంలో సుయోధన (Suyodhana) పాత్రకు సాయికుమార్ గారు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఆయన అంత బాగా నటించారు. ప్రేక్షకుల ఊహకు అందనంత ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఈ కథ, టైటిల్ విన్నప్పుడే కొత్తగా ఉంటుందనే నమ్మకం కలిగింది’ అని అన్నారు ప్రియదర్శి (Priyadarshi).
ఆయన కథానాయకుడిగా మాధవ్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సుయోధన’. ద్రిషిక చందర్ కథానాయిక. సీనియర్ నటుడు సాయికుమార్ కథలో కీలక పాత్ర పోషించారు. ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మించారు. సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ‘నేను 1972లో ఒక నాటికలో దుర్యోధనుడి పాత్ర పోషించాను. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. ఇప్పుడు ఈ చిత్రంలో సుయోధనుడిగా నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకువచ్చాయి’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు మాధవ్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో సౌండ్ కీ రోల్ ప్లే చేస్తుందని, ప్రియదర్శి కొత్త తరహా పాత్రలో కనిపిస్తారు’ అని వివరించారు. నిర్మాత బోసుబాబు మాట్లాడుతూ ‘బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్, కార్తీక్ కెమెరా, జై క్రిష్ సంగీతం, చోటా కె.ప్రసాద్ ఎడిటింగ్...ఇలా అందరూ తమ నైపుణ్యాలతో నాణ్యమైన సినిమా రూపుదిద్దుకోవడానికి కృషి చేశారు’ అని కొనియాడారు.