ఎన్టీఆర్ 'బర్త్ డే' ట్రీట్.. ఒకటి కాదు, ఏకంగా నాలుగు అప్‌డేట్స్!

ABN , Publish Date - Apr 19 , 2026 | 08:04 AM

గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తారక్ తన తదుపరి సినిమాలతో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులు ఏటా మే 20వ తేదీని ఒక పండుగలా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఆ ఉత్సాహం రెట్టింపు కానుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేలా వరుస అప్‌డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్లు సిద్ధమవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు నాలుగు భారీ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఈ రోజున వెలువడే అవకాశం ఉండటంతో, సోషల్ మీడియా వేదికగా ఇప్పటి నుంచే సందడి మొదలైంది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తారక్ తన తదుపరి సినిమాలతో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్‌లో అత్యంత ఆసక్తికరమైన చిత్రం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (Dragon). కేజీఎఫ్, సలార్ వంటి మాస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రశాంత్ నీల్, తారక్ కోసం ఎలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మే 20న ‘డ్రాగన్’ టైటిల్‌కు సంబంధించిన ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వీడియో గనుక వస్తే, అది ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ పార్ట్ 1 సృష్టించిన విజయం గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా ముగింపు నుంచే రెండో భాగం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినప్పటికీ, షూటింగ్ షెడ్యూల్ మరియు రిలీజ్ డేట్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అసలు ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అన్న అనుమానాలకు ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు తెరపడే అవకాశం ఉంది. మే 20న ‘దేవర 2’ పై ఒక పవర్ ఫుల్ అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (trivikram), ఎన్టీఆర్ కలయికలో ఇప్పటికే ‘అరవింద సమేత’ వంటి హిట్ చిత్రం వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే చిత్రం రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ బర్త్ డే రోజున ఉండే అవకాశం ఉంది. అయితే, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమాను మొదలుపెడతారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ‘దేవర 2’ కంటే ముందే ‘గాడ్ ఆఫ్ వార్’ సెట్స్‌పైకి వెళ్తుందనే టాక్ వినిపిస్తోంది, అదే గనుక జరిగితే దేవర రెండో భాగం కోసం అభిమానులు మరికొంత కాలం నిరీక్షించక తప్పదు.

వీటన్నింటితో పాటు, కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. వీరిద్దరి కలయికలో రాబోయే ప్రాజెక్ట్ భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఉంటుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ పుట్టినరోజున ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంది. వెట్రిమారన్ మార్క్ రానెస్, తారక్ నటన తోడైతే వెండితెరపై మ్యాజిక్ జరగడం ఖాయం. మొత్తానికి ఈ ఏడాది మే 20న తారక్ ఇచ్చే ట్రీట్స్ ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

Updated Date - Apr 19 , 2026 | 08:04 AM