యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ నుండి మరో విశేషం

ABN , Publish Date - Feb 14 , 2026 | 05:22 PM

యంగ్ టైగర్ యన్టీఆర్ - డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఇటు యన్టీఆర్ - అటు నీల్ స్టైల్స్ కలగలసి రూపొందుతోందని టాక్. ఇందులో యన్టీఆర్ వరైటీ గెటప్‌లో కనిపించనున్నారని సమాచారం.

Jr. NTR

జూనియర్ యన్టీఆర్‌ (Jr. NTR) కు ఉన్న ఇమేజ్‌కు తగ్గట్టుగా పయనిస్తూనే, తనదైన బాణీ పలికించాలని ప్రశాంత్ నీల్ (Prasanth Neel) యోచిస్తున్నారు. అందులో భాగంగా వారిద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రంలో యన్టీఆర్‌ను ఓ డిఫరెంట్ గెటప్‌లో చూపించాలని ప్రశాంత్ నీల్ తపిస్తున్నారు. యన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ ను కూడా డైరెక్టర్ ఈ మూవీలో జోడించనున్నారని తెలుస్తోంది. నటరత్న యన్టీఆర్ పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. ఆ ఖ్యాతిని అనుసరించే నటరత్న నటవారసుడు బాలకృష్ణ సైతం పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు. నందమూరి (Nandamuri) నటవంశంలో మూడోతరం స్టార్‌గా వెలుగుతున్న జూనియర్ కూడా ఆరంభంలో కొన్ని పౌరాణిక పాత్రలు ధరించారు. అసలు యన్టీఆర్ తెరపై తొలిసారి కనిపించిందే పౌరాణిక పాత్రలో కావడం విశేషం. నటరత్న నటించి దర్శకత్వం వహించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ వెర్షన్‌లో బాల భరతునిగా నటించారు జూనియర్. ఆ తరువాత 'రామాయణం'లో రాముని పాత్రతోనే పూర్తిస్థాయిలో అభినయించారు తారక్. అందువల్ల యన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ ఓ మైథలాజికల్ గెటప్ లో ప్రెజెంట్ చేయబోతున్నారని టాక్.


తన తరంలో తారక్ స్పెషల్!

అందరూ బాలలతో గుణశేఖర్ దర్శకత్వంలో యమ్.యస్.రెడ్డి తెరకెక్కించిన 'రామాయణం'లో శ్రీరామునిగా నటించి బాలుడే అయినా భళా అనిపించారు జూనియర్ యన్టీఆర్. తరువాత 'భక్త మార్కండేయ' టీవీ సీరియల్‌లోనూ టైటిల్ రోల్‌లో అలరించారు తారక్. ఆ పై తన సూపర్ డూపర్ హిట్ 'యమదొంగ'లో యంగ్ యమునిగా యన్టీఆర్ అభినయించిన తీరు అనితరసాధ్యంగా నిలచింది. తన తరం హీరోల్లో ఎక్కువగా పురాణ పాత్రలు పోషించిన యన్టీఆర్ రాబోయే సినిమాలోనూ ఓ మైథలాజికల్ గెటప్‌లో కనిపిస్తారని తెలియగానే అభిమానుల ఆనందం అంబరమంటుతోంది.


ప్రస్తుతం మూవీ మేకర్స్ తమదైన బాణీ పలికిస్తూ తమ ఫాంటసీ స్టోరీస్‌లో పౌరాణిక పాత్రలనూ చొప్పిస్తున్నారు. కొందరు స్పెషల్ గెటప్స్‌లో తమ హీరోలను మైథలాజికల్ గెటప్స్‌లో చూపిస్తున్నారు. ఈ మధ్య 'కల్కి 2898 ఏడి'లో భారతంలోని కర్ణుని పాత్రలో ప్రభాస్, అర్జునునిగా విజయ్ దేవరకొండ కనిపించారు. రాబోయే రాజమౌళి 'వారణాసి' చిత్రంలో శ్రీరామునిగా మహేశ్ బాబు కనిపిస్తారనీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీలో హీరో ఓ మైథలాజికల్ గెటప్‌లో తళుక్కుమంటారని టాక్. మరి ఇప్పటికే శ్రీరామ, మార్కండేయ, యువ యమ పాత్రల్లో మెప్పించిన తారక్ రాబోయే చిత్రంలో ఏ పురాణ పాత్రతో అలరిస్తారో చూడాలి.

Updated Date - Feb 14 , 2026 | 05:27 PM