Jr. NTR: వీడియోగ్రాఫర్‌పై.. ఎన్టీఆర్ సీరియస్! వీడియో వైరల్
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:37 PM
హీరో ఎన్టీఆర్ కు కోపమొచ్చింది. తన అనుమతిలేకుండా వీడియో, ఫోటోలు తీస్తున్న వ్యక్తిపై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) కు కోపమొచ్చింది. అవును నిజమే... తన పర్మిషన్ లేకుండా ఫోటోలను, వీడియోను తీస్తున్న వ్యక్తిపై ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ స్టార్ హోటల్ లోకి వెళ్తున్న ఎన్టీఆర్ వెనకపడి ఓ వ్యక్తి ఫోటోలను, వీడియోలను తీయడానికి ప్రయత్నించాడు. అక్కడకూ ఎన్టీఆర్ బాడీ గార్డ్స్ అతన్ని వారించే ప్రయత్నం చేశారు. ఫోన్ మాట్లాడుతూ హోటల్ లోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్... ఆ వ్యక్తి చర్యలకు ఆవేశపడి గట్టిగా అరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉంటే... ఈ వీడియోను చూసిన వారిలో కొందరు ఎన్టీఆర్ అనవసరంగా అతిగా స్పందించారని వ్యాఖ్యానిస్తుంటే... మరికొందరు ఎంత పెద్ద నటుడు అయినా ఫ్రైవసీ కోరుకుంటారని, వారి అనుమతి లేకుండా ఇష్టానుసారం ఫోటోలు తీయడం తప్పని చెబుతున్నారు. ఎన్టీఆర్ వ్యతిరేక వర్గం ఇదే అదనుగా ఈ వీడియోను తెగ వైరల్ చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే... ఎన్టీఆర్ ప్రస్తుతం 'డ్రాగన్' (Dragon) మూవీలో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ (Prasanth Neel) దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 'దేవర' (Devara) సినిమా తర్వాత వస్తున్న 'డ్రాగన్'కు మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తన ఖాతాలో మరో హిట్ ను జమ చేసుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.