Jr. NTR: పాతికేళ్ళలో విలక్షణమైన పాత్రల్లో అలరించిన యన్టీఆర్

ABN , Publish Date - May 23 , 2026 | 02:40 PM

యంగ్ టైగర్ యన్టీఆర్ ఈ యేడాది ఫ్యాన్స్ ను ఒక్క సినిమాతోనూ అలరించలేకపోయారు. అయినా ఈ సంవత్సరం యన్టీఆర్ కు ఓ స్పెషల్ అనే చెప్పాలి. మే 23తో యన్టీఆర్ హీరోగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్నారు. అదే యంగ్ టైగర్ అభిమానులకు ఆనందం పంచుతున్న అంశం.

Jr. NTR

యన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజైన 'డ్రాగన్' గ్లింప్స్ వచ్చీ రాగానే అభిమానులకు ఆనందం పంచుతూ సాగుతోంది. ఇక యంగ్ టైగర్ పుట్టినరోజున ఆయన నటించిన 'ఆంధ్రావాలా', 'ఊసరవెల్లి' చిత్రాలు రీ-రిలీజయ్యాయి. మొదట్లో అంతగా అలరించని ఈ రెండు చిత్రాలు యన్టీఆర్ బర్త్ డే అయిన మే 20న ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే యన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని' పాతికేళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం! 2001 మే 23వ తేదీన 'నిన్ను చూడాలని' విడుదలయింది. ఈ సినిమాతోనే యన్టీఆర్ ఫుల్ ప్లెజ్డ్ హీరోగా జనం ముందు నిలిచారు. అంతకు ముందు తాత యన్టీఆర్ డైరెక్షన్ లో హిందీ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లో భరతుని పాత్రలో బాలనటునిగా కనిపించారు జూనియర్. తరువాత 'రామాయణం'లో శ్రీరామునిగా నటించి మెప్పించారు. ఆ పై 'భక్త మార్కండేయ' సీరియల్ లో నటించారు. అటు తరువాత యంగ్ హీరోగా 'నిన్ను చూడాలని'తోనే జనాన్నిపలకరించారు యన్టీఆర్. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన 'నిన్ను చూడాలని' చిత్రానికి వి.ఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించారు. రవీనా నాయికగా నటించిన ఈ మూవీకి ఎస్.ఏ.రాజ్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయినా నటరత్న మనవడుగా వచ్చిన జూనియర్ ను జనం 'నవయువరత్న'గా ఆశీర్వదించారు.


పాతికేళ్ళ ప్రయాణంలో...

నందమూరి నటవంశంలో మూడోతరం హీరోగా జూనియర్ యన్టీఆర్ అడుగు పెట్టారు. వచ్చీ రాగానే తాత యన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణ అభిమానులను సైతం మెప్పించారు. ఇక యంగ్ హీరోగా యన్టీఆర్ కు తొలి సినిమా నిరాశ పరచినా, రెండో చిత్రం 'స్టూడెంట్ నంబర్ వన్'తో బంపర్ హిట్ లభించింది. ఈ సినిమాతోనే డైరెక్టర్ గా రాజమౌళి కెరీర్ ఆరంభమయింది. 'స్టూడెంట్ నంబర్ వన్'తోనే యన్టీఆర్ స్టార్ హీరోగా మారిపోయారు. పాతికేళ్ళ కెరీర్ లో ఇప్పటిదాకా యంగ్ టైగర్ "ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ట్రిపుల్ ఆర్, దేవర" వంటి చిత్రాల్లో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.


పౌరాణికాల్లోనూ....

నటవారసుల్లో నందమూరి నటవంశానికే చెందిన బాలకృష్ణ అరుదైన రికార్డులు నమోదు చేశారు. ఇక నందమూరి వంశం మూడోతరం స్టార్ గా జూనియర్ యన్టీఆర్ కూడా తనదైన బాణీ పలికిస్తూ కొన్ని రికార్డులు సొంతం చేసుకున్నారు. తాత యన్టీఆర్, బాబాయ్ బాలయ్యలాగే శ్రీరామ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు జూనియర్. ఇలా ఒకే నటకుటుంబంలో మూడుతరాల నటులు శ్రీరామ పాత్రలో అలరించడం అన్నది బహుశా ప్రపంచంలోనే అరుదైన అంశం. తాత, బాబాయ్ లాగే డ్యుయల్ రోల్స్ లోనూ అలరించారు జూనియర్. వారిలాగే ట్రిపుల్ రోల్ లోనూ మెప్పించారు యంగ్ టైగర్. మూడోతరం హీరోల్లో పౌరాణిక పాత్రల్లో అలరించిన నటులు యంగ్ టైగర్ కాకుండా వేరొకరు కానరారు. త్వరలోనే యన్టీఆర్ తో త్రివిక్రమ్ డైరెక్షన్ లో పౌరాణిక చిత్రం 'గాడ్ ఆఫ్ వార్' మొదలు కానుంది. ఈ సినిమా వచ్చే లోపే 2027 జూన్ 11న 'డ్రాగన్'లా ప్రేక్షకులను పలకరించనున్నారు యన్టీఆర్. మరి రాబోయే సినిమాలతో యంగ్ టైగర్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి!

Updated Date - May 23 , 2026 | 02:51 PM