ఎన్టీఆర్.. గాడ్ ఆఫ్ వార్! ఆ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. వద్దంటున్న నెటిజన్స్
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:53 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం గాడ్ ఆఫ్ వార్ తెరకెక్కుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం గాడ్ ఆఫ్ వార్ (God of War) తెరకెక్కుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'అరవింద సమేత వీరరాఘవ' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఈ ద్వయం మళ్లీ చేతులు కలపడం అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక వార్త నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) పేరును పరిశీలిస్తున్నట్లు దాదాపు ఖరారు అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ, కథలో కీలకమైన మహిళా పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారట. పురాణ గాథల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. 'వార్ 2' చిత్రంలో వీరిద్దరూ నటించినా, కియారా హృతిక్ రోషన్‌కు జోడీగా చేయడంతో.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎంపికైతే ఎన్టీఆర్ సరసన పూర్తిస్థాయి హీరోయిన్‌గా కనిపించే అవకాశం దక్కుతుంది.

కియారా తెలుగులో ఇదివరకు మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' చిత్రంలో నటించి ఘన విజయం అందుకుంది. అయితే రామ్ చరణ్‌తో చేసిన 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి. దాంతో కొందరు అభిమానులు ఈ సెంటిమెంట్‌ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుపుతున్నారు. కియారాను తీసుకోకపోవడమే మంచిదని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇవి కేవలం నెటిజన్ల అభిప్రాయాలు మాత్రమే తప్ప, సినిమా విజయానికి నేరుగా సంబంధం ఉండే అవకాశాలు లేవని సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చూడాలి మరి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ భామనే మేకర్స్ ఫైనల్ చేస్తారా? లేక మరో కథానాయికను రంగంలోకి దించుతారా? అనేది వేచి చూడాల్సిందే.
మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' మూవీ చేస్తున్నారు. తొలిసారి తారక్, నీల్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'డ్రాగన్' పై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జూన్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ కాంబో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ భారీ పాన్ ఇండియా ఎపిక్ ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
