NTR - Ram Charan: ఆ ఇద్దరి మధ్య పెరిగిన దూరం... నిజమేనా!?

ABN , Publish Date - Jun 16 , 2026 | 02:15 PM

'పెద్ది' సినిమా విడుదలైనప్పుడు రామ్ చరణ్‌ను అభినందించని జూనియర్ ఎన్టీఆర్, 'సింగ్‌ గీతం' చిత్ర బృందాన్ని అభినందించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. దాంతో ఎన్టీఆర్‌ ట్రోలింగ్‌కు గురౌతున్నారు.

Jr NTR

'అనుమానం మొగుడికి ఒళ్ళంతా కళ్ళే' అనే సామెత ఉండనే ఉంది! సోషల్‌ మీడియాలో కొంతమంది వెలిబుచ్చే అభిప్రాయాలు చూస్తే... అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత వీళ్ళు పుట్టారేమో అని కూడా అనిపిస్తుంది. ఇంతకూ విషయం ఏమిటంటే... గత శుక్రవారం సీనియర్‌ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్‌ గీతం' (Sing Geetham) విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత కూడా తెలుగు సినీ ప్రముఖులు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) ను అభినందిస్తూ, తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) సైతం వయసును లెక్క చేయకుండా సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా తీయడాన్ని మెచ్చుకున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) ను, చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) ను ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్ ను రిలీజ్‌ చేయడం సర్ ప్రైజింగ్‌గా అనిపించిందని అంటూ ఎన్టీఆర్‌ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశారు. నిజానికి ఇది అభినందించాల్సిన అంశం. చిరంజీవి మొదలు కొని జూ. ఎన్టీఆర్‌ వరకూ 'సింగ్‌ గీతం'ను మెచ్చుకున్న వారే! అయితే... 'సింగ్‌ గీతం' సినిమాను అప్రిషియేట్ చేసిన జూ. ఎన్టీఆర్.... తన తమ్ముడని చెప్పుకునే రామ్ చరణ్‌ మూవీ 'పెద్ది' విడుదలైనప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి మధ్య వ్యవహారం ఏమైనా బెడిసికొట్టిందా? అని సందేహిస్తున్నారు. ఇలాంటి వారిని చూసినప్పుడే 'అనుమానం మొగుడికి ఒళ్ళంతా కళ్ళే' అనే సామెత గుర్తుకొస్తుంది.


రామ్ చరణ్‌ - జూ. ఎన్టీఆర్‌ మధ్య దూరం పెరిగిందా? అనే సందేహాన్ని వ్యక్తం చేసే వాళ్ళు చెబుతున్న మాట ఏమిటంటే... 'ట్రిపుల్‌ ఆర్' (RRR) మూవీ విడుదలప్పుడు ఇద్దరూ సొంత అన్నదమ్ముల మాదిరి మెలిగారు. ఎన్టీఆర్‌ ఓ అడుగు ముందుకేసి... 'ఒక తల్లి కడుపున పుట్టకపోయినా చరణ్‌ నా సొంత తమ్ముడు' అనేశాడు. వారిమధ్య ఉన్న అనుబంధాన్ని చూసి ఇద్దరి ఫ్యాన్స్ తెగ మురిసి పోయారు. 'దేవర' విడుదల సమయంలో ఎన్టీఆర్‌కు రామ్ చరణ్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. కానీ 'ట్రిపుల్ ఆర్' తర్వాత రామ్ చరణ్‌ (Ram Charan) సినిమాలు 'ఆచార్య, గేమ్ ఛేంజర్‌' విడుదలైనప్పుడు ఎన్టీఆర్ ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఆ సినిమాల్లో రామ్ చరణ్‌ గొప్పగా నటించలేదనే అనుకుందాం... కానీ 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్‌ మేకోవర్ అయిన తీరు చూసి అంతా అభినందించారు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్‌... చెర్రీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం కదా! అంటున్నారు అతని అభిమానులు.


ఇదిలా ఉంటే... ఈ యేడాది మార్చి 27న రామ్ చరణ్‌ పుట్టిన రోజుకు ఎన్టీఆర్‌ విషెస్‌ చెప్పలేదు కానీ ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియచేశాడు. దాంతో మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజుకు రామ్ చరణ్‌ కూడా సోషల్ మీడియాలో విషెస్‌ చెప్పలేదు. అందువల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిందని కొందరు అంటున్నారు. అయితే... సోషల్ మీడియా వేదికగా ఒకరి గురించి ఒకరు చెప్పుకోకపోయినా... వీరి మధ్య ప్రత్యక్ష అనుబంధం బలంగా ఉందని అనే వారూ లేకపోలేదు. ఏదేమైనా కళ్ళ ముందు కనిపించిన దానినే పరిగణనలోకి తీసుకునే ఈ సమయంలో ఎన్టీఆర్‌... చరణ్‌ను పట్టించుకోకపోవడంతో అతనిపై తీవ్రంగానే ట్రోలింగ్‌ జరుగుతోంది. మరి దీనికి ఏ రకంగా ఎన్టీఆర్‌ చెక్ పెడతాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఇండస్ట్రీని షేక్ చేసిన చికిరి చికిరి వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్

దేవర 2.. నమ్మకం లేదు దొరా

Bollywood: అప్పుడు సుశాంత్‌... ఇప్పుడు సంచిత!

Updated Date - Jun 16 , 2026 | 02:47 PM