Dragon: ప్రశాంత్ నీల్ సృష్టించిన.. 'గోల్డెన్ ట్రయాంగిల్' మిస్టరీ!
ABN , Publish Date - May 22 , 2026 | 01:29 PM
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ గ్లింప్స్ వైరల్. గోల్డెన్ ట్రయాంగిల్ బాస్‌గా అసలు విలన్ ఎవరు? టోవినో థామస్ వదులుకున్న పాత్రపై ఆసక్తికర చర్చ.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఎన్నెన్నో ఆశలతో ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చింది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర, సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలుపెట్టేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మోస్ట్ అవేటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందరూ ఊహించినట్టుగానే.. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragon) అనే ఊరమాస్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. మునుపెన్నడూ చూడని సరికొత్త రగ్గడ్ అవతారంలో తారక్ కనిపించారు. ఇందులో కొద్దిగా 'సలార్' పోలికలు కనిపిస్తున్నప్పటికీ, అభిమానులు అవేమీ పట్టించుకోకుండా.. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మాస్ మేకింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. 'డ్రాగన్' గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సరే.. ఇంతకీ ఈ 'డ్రాగన్' వెనుక ఉన్న అసలు కథేంటి? గ్లింప్స్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ ఈసారి ఇండియాను దాటి ఇంటర్నేషనల్ లెవెల్ మాఫియాను టచ్ చేసినట్టు క్లియర్ గా అర్థమవుతోంది. బ్రిటీష్ వాళ్ళు దాదాపు 200 ఏళ్ళ పాటు భారతదేశంపై ఆధిపత్యం చెలాయించడానికి, ఇక్కడి సంపదను దోచుకోవడానికి హెరాయిన్ ప్రధాన కారణమనే కోణంలో ఈ కథ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటీష్ పాలకులు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయాక.. ఇక్కడ మిగిలిపోయిన ఆ నల్లమందు సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి రెండు పెద్ద వర్గాలు రక్తపాతం సృష్టించుకునే నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. గ్లింప్స్‌లో మనకు చూపించిన విజువల్స్ అన్నీ అఫ్ఘానిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌ను తలపిస్తున్నాయి. అక్కడ అఫ్ఘాన్ గ్యాంగ్స్ చేస్తున్న యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఈ గ్లింప్స్‌లో కనిపించిన అఫ్ఘాన్ వీరులేమీ మెయిన్ విలన్స్ కాదు. వీరంతా కేవలం ఒక వర్గానికి చెందిన టీమ్ మాత్రమే. మరి అసలైన విలన్ ఎక్కడ ఉన్నాడు?
ఈ కథలో అసలైన డార్క్ నెట్వర్క్ ఎక్కడుందంటే.. గోల్డెన్ ట్రయాంగిల్ టీమ్‌లో! ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాలో గోల్డెన్ ట్రయాంగిల్ అంటే థాయిలాండ్, లావోస్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాలు. ఈ ఏరియా నుంచే ప్రపంచానికి నల్లమందు సరఫరా అవుతుంటుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ గ్లింప్స్‌లో ఆ గోల్డెన్ ట్రయాంగిల్ బాస్‌ను ఇంకా పరిచయం చేయలేదు. అక్కడే అసలైన సస్పెన్స్ దాగుంది.
గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఈ డ్రాగన్ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్‌ను వదులుకున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. హీరో ఎన్టీఆర్‌కు ధీటైన విలన్ క్యారెక్టర్ ఇదని, ఒకవేళ టోవినో ఈ పాత్ర చేసి ఉంటే ఆయన కెరీర్‌కే మైలురాయిగా నిలిచేదని ఇండస్ట్రీ టాక్. గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి అసలు టోవినో వదులుకున్న ఆ పాత్ర ఏంటై ఉంటుందా అని నెటిజన్లు తెగ ఆరాలు తీస్తున్నారు.
ఇండస్ట్రీ లోపల అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ అఫ్ఘాన్ టీమ్ కాకుండా, మెయిన్ విలన్ అయిన 'గోల్డెన్ ట్రయాంగిల్ బాస్' పాత్ర కోసమే ప్రశాంత్ నీల్ మొదట టోవినో థామస్‌ను సంప్రదించారట. అంతర్జాతీయ స్థాయి డ్రగ్ సామ్రాజ్యాన్ని ఏలే ఆ క్రూరమైన విలన్‌ను ఎదిరించడానికే.. మన తారక్ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్ 'డ్రాగన్' గా మారుతాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. క్యారెక్టర్ గ్రాఫ్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు టోవినోకు విపరీతంగా నచ్చాయట. కాకపోతే దురదృష్టవశాత్తూ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఆయన ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో అతి పెద్ద మిస్టరీగా మారింది. అంత పవర్‌ఫుల్ రోల్‌లో ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఏ ఇండియన్ స్టార్ హీరోను రంగంలోకి దింపబోతున్నాడు? ఎన్టీఆర్ లాంటి నటన సింహాన్ని ఢీకొట్టే ఆ 'గోల్డెన్ ట్రయాంగిల్ బాస్' గా ఎవరు కనిపిస్తే బాగుంటుంది? బాలీవుడ్ నుంచి ఎవరినైనా తెస్తున్నారా.. లేక కోలీవుడ్, శాండల్‌వుడ్ స్టార్స్ వైపు చూస్తున్నారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో కేజీఎఫ్, సలార్ చిత్రాలను చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ 'డ్రాగన్' లో ఎన్టీఆర్‌తో తలపడే ఆ మైటీ విలన్ రోల్‌లో ఎవరు నటిస్తారో చూడాలి.