Sri Krishna Pandaveeyam: 60 ఏళ్ళు.. పూర్తి చేసుకున్న 'శ్రీక్రిష్ణపాండవీయం'

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:05 PM

మహానటుడు నటరత్న యన్టీఆర్ లో దాగిన దర్శకత్వ ప్రతిభకు మరింత వన్నె తెచ్చిన చిత్రం 'శ్రీక్రిష్ణ పాండవీయం'. యన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించిన 'శ్రీక్రిష్ణ పాండవీయం' అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ నాటి విశేషాలను మననం చేసుకుందాం.

Sri Krishna Pandaveeyam

తెలుగునాటనే కాదు అవనిలోనే శ్రీకృష్ణభగవానుని పాత్రలో అత్యధిక పర్యాయాలు నటించి మెప్పించిన ఏకైక నటుడు నటరత్న యన్టీఆర్ (N. T. Rama Rao). ఆయన స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రల్లో నటించి తెరకెక్కించిన చిత్రం శ్రీక్రిష్ణ పాండవీయం (Sri Krishna Pandaveeyam). శిష్ట రక్షణ, దుష్టశిక్షణ చేసే శ్రీకృష్ణునిగా ఓ వైపు, దురహంకారంతో విర్రవీగే అభిమానధనుడు సుయోధనునిగా మరోవైపు నటించి 'శ్రీక్రిష్ణ పాండవీయం' చిత్రాన్ని రక్తి కట్టించారు యన్టీఆర్. యన్.ఏ.టి. (NAT, Ramakrishna Cine Studios) పతాకంపై యన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు (Trivikrama Rao) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతోనే ప్రఖ్యాత నటి కె.ఆర్.విజయ తెలుగు తెరకు పరిచయమయ్యారు. 1966 జనవరి 13న ఈ చిత్రం విడుదలై విజయఢంకా మోగించింది.

యన్టీఆర్ దర్శకత్వం వహించి నటించిన తొలి చిత్రం 'సీతారామకళ్యాణం', రెండో సినిమా 'గులేబకావళి కథ'. ఈ రెండు చిత్రాలకు డైరెక్టర్ గా పేరు వేసుకోని యన్టీఆర్, సీనియర్ డైరెక్టర్ పి.పుల్లయ్య సూచనతో దర్శకునిగా టైటిల్ వేసుకున్న మొదటి సినిమా 'శ్రీక్రిష్ణపాండవీయం'. అంతకు ముందు పలు చిత్రాల్లో శ్రీకృష్ణునిగా మెప్పించిన యన్టీఆర్ ఇందులో మరోమారు తనదైన బాణీ పలికించారు. అప్పటికే ఎందరో మహానటులు పోషించిన సుయోధన పాత్రలో తన శైలిని విభిన్నంగా ప్రదర్శించి మెప్పించారు యన్టీఆర్. దాంతో 'రారాజు' అంటూ ఓ సినిమాను రూపొందించాలనుకున్న యస్వీఆర్ - యన్టీఆర్ అభినయం చూసి ఆ ప్రయత్నం మానుకున్నారు. దీనిని బట్టే దుర్యోధన పాత్రలో రామారావు నటన ఎంతలా రంజింప చేసిందో అర్థం చేసుకోవచ్చు.

Sri Krishna Pandaveeyam

శ్రీమద్భాగవత, భారతాలను మిళితం చేసి 'శ్రీక్రిష్ణపాండవీయం' చిత్ర రచన చేశారు సముద్రాల. టి.వి.రాజు స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి సముద్రాల, కొసరాజు, సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు. అనువైన చోట పోతన భాగవత పద్యాలను వినియోగించుకున్నారు. కాంతారావు, శోభన్ బాబు, ఉదయ్ కుమార్, బాలయ్య, రాజనాల, సత్యనారాయణ ముఖ్యపాత్రధారులు. 'శ్రీక్రిష్ణ పాండవీయం' చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ నాటి సంక్రాంతి చిత్రాల్లో మేటిగా నిలచింది. 9 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. రిపీట్ రన్స్ లో వసూళ్ళ వర్షాలు కురిపించింది.

1990లలో కొత్త సినిమాలను సైతం వెనక్కి నెట్టి పలు కేంద్రాలలో అర్ధ శతదినోత్సవం, కొన్ని కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది 'శ్రీక్రిష్ణపాండవీయం'. అరవై ఏళ్ళయినా ఈ నాటికీ జనాన్ని పర్వదినాల్లో అలరిస్తూనే ఉందీ చిత్రం. నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి నంది అవార్డ్ సైతం గెల్చుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం యూట్యూబ్‌తో పాటు స‌న్ నెక్స్ట్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల‌లోనూ అందుబాటులో ఉంది

Updated Date - Jan 13 , 2026 | 01:26 PM