అంద‌రి చూపు.. విశ్వంభ‌ర‌పైనే! వ‌చ్చేది.. ఇక అప్పుడేనా?

ABN , Publish Date - Feb 23 , 2026 | 09:40 AM

మెగాస్టార్ చిరంజీవి పొంగల్ బరిలో బంపర్ హిట్ పట్టేశారు. ఇప్పుడు ఫ్యాన్స్ చూపు చిరంజీవి నెక్ట్స్ మూవీపై సాగుతోంది. అదెప్పుడు వస్తుందా అన్నదే అభిమానుల ఆసక్తి. దానిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి.

vishwambhara

చిరంజీవి (Chiranjeevi) కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ సీనియర్ హీరోస్ అందరిలోనూ భారీ వసూళ్ళు చూసిన చిత్రంగా మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) నిలచింది. దాంతో అభిమానులు మేఘాల్లో తేలిపోతున్నారు. చిరంజీవి రాబోయే సినిమా విశ్వంభర (Vishwambhara) సైతం సక్సెస్ రూటులో సాగడం ఖాయమని వారు ఆశిస్తున్నారు. చిరంజీవి కొన్ని ఫ్లాపుల తరువాత బిగ్ హిట్స్ వరుసగా సాగిస్తూ పోయారు. అందుకు ఆయన కెరీర్ లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

'మృగరాజు' పరాజయం తరువాత ఆయన సినిమాలు అంతగా అలరించలేదు. అయితే తరువాత యేడాది వచ్చిన 'ఇంద్ర' సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకుంది. ఆ వెంటనే వచ్చిన చిరంజీవి సినిమా 'ఠాగూర్' కూడా ఘనవిజయం సాధించింది. అందువల్లే 'మన శంకరవరప్రసాద్ గారు' తరువాత వచ్చే 'విశ్వంభర' కూడా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

'విశ్వంభర' విషయంలో కొన్ని అనుమానాలు సైతం పొడసూపుతున్నాయి. ఎందుకంటే 'మన శంకరవరప్రసాద్ గారు' కంటే ముందే 'విశ్వంభర' చిత్రం పూర్తయింది. ఆ సినిమాను 2025 జనవరిలోనే సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. అప్పట్లో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' కోసం 'విశ్వంభర'ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే తరువాత 'విశ్వంభర' మూవీలోని కొన్ని సీన్స్‌ను మరింత బాగా రూపొందించడానికి మళ్ళీ గ్రాఫిక్ వర్క్ మొదలెట్టినట్టు ప్రచారం సాగింది.

Vishwambhara_e45b9ee4ac.jpg

ఆ తరువాత 'మన శంకరవరప్రసాద్ గారు' ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అప్పుడు 'విశ్వంభర' బిజినెస్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి సక్సెస్ గ్యారంటీ అని మేకర్స్ భావించినట్టు సమాచారం. అనుకున్నట్టుగానే 'మన శంకర వరప్రసాద్ గారు' బంపర్ హిట్టయింది. అందువల్ల 'విశ్వంభర'కు కూడా క్రేజ్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని సరైన సమయం చూసుకొని బాక్సాఫీస్ బరిలో దూకుతుందని పరిశీలకులు అంటున్నారు. ఇక్కడే కొందరిలో అనుమానాలు వస్తున్నాయి. ఇలా గ్రాఫిక్స్ కోసం డిలే అయిన 'అంజి' సినిమా 2004 సంక్రాంతి సీజన్‌లో వచ్చినా, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది కదా అని గుర్తు చేస్తున్నారు.

'అంజి'లాగా 'విశ్వంభర' కూడా అవుతుందా అన్న అనుమానాలు ఉండవచ్చు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన అంశం కూడా చోటు చేసుకుంది. అదేమిటంటే 'విశ్వంభర' చిత్రానికి వశిష్ఠ దర్శకుడు. అతను యంగ్ డైరెక్టర్ కావడం వల్ల నవతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను రూపొందించి ఉంటారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, గ్రాఫిక్స్ వర్క్ లోనూ వశిష్ఠ (Mallidi Vassishta) ఆరితేరినవాడని ఆయన తొలి సినిమా 'బింబిసార' చూసిన వారికి అర్థమవుతుంది. అందులోనూ చిరంజీవి లాంటి మెగాస్టార్‌తో తీసిన సినిమా కాబట్టి 'విశ్వంభర' పాత తరం అభిమానులను సైతం ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

ఇలా చిరంజీవి తరువాతి చిత్రం 'విశ్వంభర'పై చర్చ సాగుతోంది. ఈ డిస్కషన్ సినిమాకు మరింత క్రేజ్ సంపాదించి పెడుతుందనీ భావిస్తున్నారు. ప్రస్తుతం 'విశ్వంభర' చిత్రం జూలై 10 తేదీన విడుదల కానుందని విశేషంగా వినిపిస్తోంది. అదే సరైన సమయమనీ ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. అంతేకాదు 2015 జూలై 10న రిలీజైన 'బాహుబలి-ద బిగినింగ్' ఇండస్ట్రీ హిట్‌గా నిలచింది. అదే సీన్ 'విశ్వంభర' విషయంలోనూ రిపీట్ కానుందనీ అభిమానుల అభిలాష. వారి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

కాగా.. యూవీ క్రియేష‌న్స్ (UV Creations) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో త్రిష (Trisha Krishnan), అషికా రంగ‌నాధ్ (Ashika Ranganath), సుర‌భి, ఇషా చావ్లా, ర‌మ్య ప‌సుపులేటి వంటి ముద్దుగుమ్మ‌లు కీ రోల్స్ చేస్తుండ‌గా బాలీవుడ్ న‌టుడు కునాల్ క‌పూర్ (Kunal Kapoor) ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి చాలా విరామం త‌ర్వాత చిరంజీవి మూవీకి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 10:04 AM