బాలయ్య స్వింగ్.. మాములుగా లేదుగా!
ABN , Publish Date - Apr 12 , 2026 | 09:50 AM
సీనియర్ హీరోల్లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చూపిస్తున్న జోరు అంతా ఇంతా కాదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేస్తూ దూసుకెళ్తున్నారు.
సీనియర్ హీరోల్లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Balakrishna)చూపిస్తున్న జోరు అంతా ఇంతా కాదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ఫైనల్ చేస్తూ దూసుకెళ్తున్నారు. వయసు పెరుగుతున్నా కొద్దీ కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ ఆయన చూపిస్తున్న జోరు చూస్తుంటే.. బాలయ్య స్వింగ్ మాములుగా లేదుగా అని అనక తప్పదు. అఖండ సినిమాతో మొదలైన బాక్సాఫీస్ వేట, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోయింది. గత ఏడాది అఖండ-2 ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, బాలయ్య స్పీడులో మాత్రం రవ్వంత కూడా మార్పు రాలేదు.
ప్రస్తుతం బాలయ్య తన తర్వాతి చిత్రాన్ని గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. మొదట ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని ప్రచారం జరిగినా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లోకి మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్య మార్క్ డైలాగులు, గోపీచంద్ మలినేని మార్క్ ఎలివేషన్లు ఈ సినిమాలో పీక్స్ లో ఉండబోతున్నాయట.
గోపీచంద్ సినిమా సెట్స్‌పై ఉండగానే, బాలయ్య తన తర్వాతి లైనప్‌ను సెట్ చేసుకున్నారు. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు వివేక్ ఆత్రేయ (Vivek Athreya). బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా అనగానే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్యలోని మాస్ యాంగిల్‌ను చూపిస్తూనే, వివేక్ తనదైన స్టైల్ మేకింగ్‌తో ఈ సినిమాను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.
ఇక తాజాగా ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే.. బాలయ్య వందో చిత్రం అయిన గౌతమీపుత్ర శాతకర్ణితో గొప్ప విజయాన్ని అందించిన డైరెక్టర్ క్రిష్ జగర్లమూడి (Krish Jagarlamudi) తో మరోసారి చేతులు కలపబోతున్నారట. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక క్లాసిక్ టచ్ ఉంటుంది. ఇప్పటికే బాలయ్య కథను ఫైనల్ చేశారని సమాచారం.
కేవలం బాలయ్య సినిమా మాత్రమే కాదు, నందమూరి వారసుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ సినిమాకు కూడా క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంటే ఒకేసారి అటు తండ్రిని, ఇటు కొడుకుని క్రిష్ హ్యాండిల్ చేయబోతున్నారన్నమాట. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు. ఇలా అన్ని రంగాల్లోనూ బాలయ్య తనదైన ముద్ర వేస్తున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు.