శ్రీమతిగా మారిన నివేదా థామస్ ..

ABN , Publish Date - Nov 23 , 2026 | 08:19 PM

నివేదా థామస్ (Nivetha Thomas).. పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈమధ్యకాలంలో గ్లామర్ పాత్రల కంటే కథకు ప్రాధాన్యత కలిగిన పాత్రలకే మొగ్గు చూపుతున్న నివేదా.. శ్రీమతిగా మారింది.

Nivetha Thomas

నివేదా థామస్ (Nivetha Thomas).. పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈమధ్యకాలంలో గ్లామర్ పాత్రల కంటే కథకు ప్రాధాన్యత కలిగిన పాత్రలకే మొగ్గు చూపుతున్న నివేదా.. శ్రీమతిగా మారింది. ఏంటి ఆమె పెళ్లి చేసుకుందా అని అనుకోకండి. నివేదా నటించిన సినిమా పేరు శ్రీమతి. విశ్వ‌క్ ఖండేరావు దర్శకత్వంలో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో తిరువీర్‌, హ‌రితేజ‌, రేణూ దేశాయ్‌, గోప‌రాజు ర‌మ‌ణ త‌దిత‌రులు ఇత‌ర పాత్రల్లో న‌టించారు. ఇప్పటికే శ్రీమతి నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.


ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ విషయానికొస్తే.. మ‌ధుశ్రీ(నివేదా)కి డ్యాన్సర్ అవ్వాలని కోరిక. ఈలోపే పెద్దలు వాసుదేవ్(తిరువీర్)తో వివాహం చేస్తారు. అత్తగారిల్లు మధుశ్రీకి ఒక నరకంగా కనిపిస్తుంది. మామ, భర్తకి సేవలు చేయడానికే ఆమెకు సమయం సరిపోతుంది.వంట చేయడం, ఇంట్లో పని చేయడం, మామగారికి నచ్చిన వంటలు వండడం ఇదే ఆమెకు అలవాటుగా మారుతుంది. ఉద్యోగానికి వెళ్ళాలి అన్నా భర్త, మామ పర్మిషన్ కావాలి. మరి మెట్టినింటి ఆచారాలు, వ్యవహారాలతో విసిగిపోయిన మధుశ్రీ ఏం చేసింది.. ? చివరికి తన ఆశయాలను, లక్ష్యాలను ఆమె చేరుకోగలిగిందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


ఇప్పటికే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకున్న ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాకి శ్రీమతి రీమేక్ లా కనిపిస్తోంది. మలయాళంలో నిమిషా, తమిళ్ లో ఐశ్వర్య రాజేష్, హిందీలో సాన్య మల్హోత్రా పాత్రను తెలుగులో నివేదా చేస్తోంది. ఇప్పటికే తమిళ్ సినిమాని తెలుగులో కూడా డబ్ చేశారు. కానీ, శ్రీమతిలో మాత్రం నేటివిటీ, పాత్రలు అన్ని తెలుగువారు చేయడంతో మరింత హైప్ వచ్చింది. డిసెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5 తెలుగులో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకోనుందో చూడాలి.

Updated Date - Nov 23 , 2026 | 08:27 PM