Nivetha Pethuraj: నా బాయ్‌ఫ్రెండ్‌.. ఎవరికోసం నన్ను వదిలేస్తాడో ముందే ఊహించా!

ABN , Publish Date - Sep 27 , 2026 | 08:26 AM

నివేదా పేతురాజ్ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టి వరుస సినిమాలతో బిజీ అయ్యింది.

Nivetha Pethuraj

‘మెంటల్‌ మది’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj). మంచి హీరోయిన్‌గా మార్కులు పడ్డా... మధ్యలో సినిమాలకు దూరమవ్వాలనే ఆలోచన చేసింది. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టి వరుస సినిమాలతో బిజీ అయ్యింది. త్రివిక్రమ్‌ ‘ఆదర్శ కుటుంబం’లో సెకండ్‌ లీడ్‌గా చేస్తున్న సందర్భంగా... ఆమె చెబుతున్న కబుర్లివి...

వాళ్లను చూసి...

కొన్నేళ్ల క్రితం నాకు ఫ్లమ్‌ లిప్స్‌ కావాలి అనిపించింది. సర్జరీ చేయించుకోవాలనుకున్నా. నా వ్యక్తిగత వైద్యుడి దగ్గరకు వెళ్లా. ఆయన నన్ను తిట్టాడు. దానివల్ల భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యల గురించి నాకు వివరించి చెప్పాడు. దాంతో వద్దనుకున్నా. ఎలాంటి సర్జరీలు చేయించుకోకుండానే సాయి పల్లవి, నిత్యామీనన్‌ రాణిస్తున్నారు కదా... వాళ్లసలు మేకపే వేసుకోరు. అయినా అందంగానే ఉన్నారు కదా... నేనెందుకు ఇలా పిచ్చిగా ఆలోచిస్తున్నా అనిపించింది.

ఏది అనుకున్నా...

నేను మనసులో ఏదైనా నెగిటివ్‌గా అనుకుంటే అది జరిగిపోతుంది. నా బాయ్‌ఫ్రెండ్‌ విషయంలో అదే జరిగింది. ఎవరికోసం తను నన్ను వదిలేస్తాడో కూడా ఊహించా. సరిగ్గా అదే జరిగింది. అందుకే ఆ తర్వాత నుంచి ఏదీ అనుకోవట్లేదు. కానీ మనసు ఊరుకోదు కదా! ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి.

హిమాలయాలకు...

నేను 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. పానిక్‌ అటాక్స్‌ కూడా వచ్చాయి. దాన్నుంచి బయట పడటానికి చాలా అవస్థలు పడ్డా. మళ్లీ అవకాశాలు రాకపోతే ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. అలా వెళ్లిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్నా.

Nivetha Pethuraj

ఆ కిక్కే వేరు...

నాకు నటనతో పాటు క్రీడలంటే చాలా ఇష్టం. బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌ ఆడేదాన్ని. నేను ఉద్యోగం చేసేప్పుడు రేసింగ్‌ జరిగే చోటుకు వెళ్లా. మోటార్‌స్పోర్ట్స్‌, రేసింగ్‌పై కూడా ఆసక్తి పెరిగింది. ఫార్ములా రేస్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లో లెవల్‌ 1 పూర్తి చేశా. రేసింగ్‌ను సీరియస్‌గా తీసుకోవాలనుకుంటున్నా. రేసింగ్‌ కారులో హెల్మెట్‌ పెట్టుకుని, కారును వేగంగా నడుపుతుంటే ఆ కిక్కే వేరు.

దుబారా ఇష్టం ఉండదు...

ప్రయాణాలంటే ఇష్టం. షూటింగ్‌ లేదంటే బ్యాగ్‌ సర్దుకోవాల్సిందే. జపాన్‌, బాలి, నార్వే, డెన్మార్క్‌, సౌత్‌ కొరియా... ఇలా చాలా ప్రదేశాలు తిరిగా. ఒక్కోసారి ఒంటరిగానే ఫ్లయిట్‌ ఎక్కేస్తుంటా. సముద్ర తీరాల్లో రిలాక్స్‌ అవ్వడం ఇష్టం. ప్రయాణాల్లో ఎక్కువ ఖర్చు చేయను. మామూలు హోటల్‌ గదులే తీసుకుంటా. దుబారా ఖర్చు ఇష్టం ఉండదు.

నటన నా కల...

నాకు చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే ‘టిక్‌ టిక్‌ టిక్‌’ సినిమా చేశా. భారత వ్యోమగామి కల్పనా చావ్లా జీవితాన్ని ఎవరైనా సినిమాగా తెరకెక్కిస్తే... అందులో నటించాలనే కోరిక ఉంది. అలాంటి ఆసక్తికరమైన కథలో ఏ పాత్రనైనా చేసేందుకు సిద్ధం.

Updated Date - Sep 27 , 2026 | 08:42 AM