తెలుగు ప్రేక్షకులకు దూరమైన నిత్యా మీనన్!

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:09 PM

టాలీవుడ్‌లో సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న నిత్యామీనన్‌ ఈ ఏడాది ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'మిస్టర్ అండ్ మిసెస్ గ్రే' డిసెంబర్ 11న విడుదల కానుంది.

Nitya Menen

పదిహేనేళ్ళ క్రితం 'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్ ఆ తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించింది. యంగ్ హీరోస్ చిత్రాలలోనే కాదు అగ్రకథానాయకుల సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే కొంతకాలంగా నిత్యా మీనన్ చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. కథ నచ్చాలే కానీ తాను నిర్మాణ భాగస్వామిగా మారడానికి కూడా నిత్యా మీనన్ వెనకాడలేదు. అలా 2021లో 'స్కైలాబ్‌' అనే చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించి, నటించింది. కానీ ఆ సినిమా ఆమెకు చేదు అనుభవాన్ని అందించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ సరసన చివరగా 'భీమ్లా నాయక్‌'లో నటించింది. ఆపైన మరే స్ట్రయిట్‌ తెలుగు సినిమాలోనూ చేయలేదు. అయితే మధ్యలో 'కుమారి శ్రీమతి' అనే వెబ్ సీరిస్ లో మాత్రం నటించింది. ఆ తర్వాత ఆమె నటించిన డబ్బింగ్‌ సినిమాలతోనే తెలుగువారూ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


గత యేడాది నిత్యామీనన్ నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. 'జయం' రవి సరసన నిత్యా నటించిన 'కాదలిక్కు నేరమిల్లై' తెలుగు వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక విజయ్‌ సేతుపతి సరసన నిత్యా మీనన్ నటించిన 'తలైవాన్ తలైవి' సినిమా అప్పుడే తెలుగులో 'సార్‌ మేడమ్' పేరుతో డబ్ అయ్యింది. అలానే గత యేడాది దీపావళి కానుకగా ధనుష్ సరసన నిత్యా మీనన్ నటించిన 'ఇడ్లీ కడై' మూవీ వచ్చింది. అది కూడా తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో డబ్ అయ్యింది. చిత్రం ఏమంటే... ఈ యేడాది నిత్యామీనన్ నటించిన తమిళ చిత్రం ఒక్కటీ విడుదల కాలేదు. ఆమె నటిస్తున్న హిందీ సినిమా 'మిస్టర్ అండ్‌ మిసెస్ గ్రే' ఒక్కటే విడుదలకు సిద్థంగా ఉంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా డిసెంబర్‌ 11న థియేటర్లలో సందడి చేయబోతోంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్‌ మూవీగా వస్తున్న ఈ సినిమాను హిందీలో తప్ప వేరే ఏ భాషలోనూ డబ్ చేయడం లేదు. సో... నిత్యా మీనన్ ను మిస్‌ అవుతున్నామని భావిస్తున్న ఆమె అభిమానులు ఈ హిందీ సినిమాను చూసి ఈ యేడాదికి శుభం పలకడమే మిగిలి ఉంది!

ఇవి కూడా చదవండి:

దుల్కర్ సల్మాన్‌కు.. తెలుగులో అసలైన అగ్నిపరీక్ష!

నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్.. 15 ఏళ్ల తర్వాత చైతూ, సుకుమార్ కాంబో మ్యాజిక్ చేస్తుందా?

హీరోయిన్ల బాక్సాఫీస్ వార్.. కల్యాణి రికార్డును రష్మిక బ్రేక్ చేస్తుందా?

Updated Date - Nov 18 , 2026 | 06:16 PM