ఇదేంద‌య్యా ఇది.. బన్నీ 'రాకా' మేనరిజమ్స్‌కు లీగల్ షీల్డ్!

ABN , Publish Date - May 14 , 2026 | 08:54 PM

దక్షిణాది సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన 'పుష్ప'రాజ్ ఒకవైపు, కమర్షియల్ సినిమాలకు హాలీవుడ్ స్థాయి మేకింగ్‌ను అద్దే అట్లీ మరోవైపు.

Allu Arjun

దక్షిణాది సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన 'పుష్ప'రాజ్ ఒకవైపు, కమర్షియల్ సినిమాలకు హాలీవుడ్ స్థాయి మేకింగ్‌ను అద్దే అట్లీ (Atlee)మరోవైపు.. వీరిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ రాకా (Raaka). ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక విలక్షణమైన లుక్‌లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఆయన 'బీస్ట్' తరహా అవతారం, చేతికి ఉండే గోళ్లు వంటి ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె నటిస్తుండటం మరో విశేషం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త చర్చ నడుస్తోంది. ఈ చిత్రంలోని హీరో డైలాగ్స్, మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌ను లీగల్‌గా కాపీరైట్ చేయాలని సన్ పిక్చర్స్ భావిస్తుండటం చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే, ఒక సినీ క్యారెక్టర్‌కు ఈ స్థాయిలో చట్టపరమైన రక్షణ కల్పించడం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది. ప్రతి సినిమాలోనూ తనదైన శైలితో కొత్త రూట్ క్రియేట్ చేసే బన్నీ, ఈసారి ‘రాకా’తో లీగల్ అంశాల్లోనూ ట్రెండ్ సెట్ చేసేలా కనిపిస్తున్నారు.

ఈ వినూత్న ఆలోచన వెనుక ‘పుష్ప’ సినిమా ఎఫెక్ట్ బలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘తగ్గేదేలే’ అనే మేనరిజం, చిత్తూరు యాస, భుజం ఎగరేయడం వంటివి ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో ప్రతి ఒక్కరికీ ఎరుకే. క్రికెటర్ల నుంచి పొలిటికల్ లీడర్ల వరకు, చిన్న అడ్వర్టైజ్‌మెంట్‌ల నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ల వరకు అందరూ వీటిని వాడేశారు. దీనివల్ల సినిమాకు పబ్లిసిటీ వచ్చినా, కమర్షియల్‌గా మాత్రం బ్రాండ్ అల్లు అర్జున్‌కు ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరలేదు. అందుకే ‘రాకా’ విషయంలో క్యారెక్టర్‌ను మానిటైజ్ చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.

హాలీవుడ్‌లో మార్వెల్, డిస్నీ వంటి సంస్థలు తమ క్యారెక్టర్లు, క్యాచ్‌ఫ్రేజ్‌లను ట్రేడ్‌మార్క్ చేయడం చాలా సాధారణమైన విషయం. అయితే ఇండియాలో షోలే వంటి పెద్ద సినిమాలకు కూడా ఇలాంటి పూర్తిస్థాయి కాపీరైట్ రక్షణ లేదు. ఒకవేళ ‘రాకా’ టీమ్ ఈ విషయంలో సక్సెస్ అయితే, ఇండియన్ సినిమా కాపీరైట్ రూల్స్ మొత్తం మారిపోతాయి. భవిష్యత్తులో రీల్స్ చేయాలన్నా, మీమ్స్ వేయాలన్నా లేదా యాడ్స్‌లో పేరడీలు చేయాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు రాయల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ నిర్ణయంలో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. ఒక సినిమా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడానికి ఆడియన్స్ క్రియేట్ చేసే మీమ్స్, రీల్స్ ఎంతో కీలకంగా మారుతుంటాయి. ‘పుష్ప’ అంతటి భారీ విజయం సాధించడానికి ‘తగ్గేదేలే’ రీల్స్ చేసిన ఆర్గానిక్ రీచ్ ప్రధాన కారణం. ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్‌లు ఇవ్వడం మొదలుపెడితే, ప్రజల్లో ఉండే ఆ ఉత్సాహం తగ్గిపోయి క్రేజ్ పడిపోయే ప్రమాదం ఉంది. కంట్రోల్ పేరుతో క్రియేటివిటీని చంపేయకూడదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - May 14 , 2026 | 08:54 PM