Tollywood: కొత్త దర్శకుల మలి చిత్రాలపై ఆసక్తి....

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:35 PM

దర్శకులుగా 2025లో చిత్రసీమలోకి తొలిసారి అడుగుపెట్టి విజయాన్ని, గుర్తింపును పొందిన వారు ఎందరో ఉన్నారు. వారు త్వరలో ఎవరితో చిత్రాలను రూపొందిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

2025 New Directors

గడిచిన యేడాది పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే మంచి విజయాన్ని సాధించాయి. దాంతో చిన్న చిత్రాల నిర్మాతలలో కొత్త ఆశలు చిగురించాయి. పెద్ద, మీడియం బడ్జెట్ మూవీస్ కంటే చిన్న సినిమాలు పొందిన విజయం అగ్ర దర్శక, నిర్మాతలను సైతం ఆలోపించ చేసింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కు దక్కిన ఈ విషయానికి కారకులు ఆ చిత్ర దర్శకులే.

ఒకసారి 2025లో పరిచయం అయిన సక్సెస్ ఫుల్ దర్శకుల విషయానికి వస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. నిజానికి ప్రతి సంవత్సరం కొత్త హీరోలు, హీరోయిన్ల కంటే కొత్త దర్శకులే ఎక్కువ పరిచయం అవుతుంటారు. అయితే సినిమాల రూపకల్పనలో జరిగే జాప్యం, నిర్మాతలు వాటిని సరిగా ప్రమోట్ చేయలేకపోవడం, కంటెంట్ ను కొత్తవారు సరిగా ప్రెజెంట్ చేయలేకపోవడం వల్ల అధిక శాతం నూతన దర్శకుల చిత్రాలు పరాజయం పాలవుతుంటాయి. అయితే గత యేడాది 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) తో దర్శకుడి పరిచయం అయిన సాయి మార్తండ్ (Sai Marthand) మంచి విజయాన్ని అందుకున్నాడు. మౌళి తనూజ్ ప్రశాంత్ (Mouli Tanuj Prashanth), శివానీ నాగారం (Shivani Nagaram) జంటగా నటించిన ఈ సినిమాను కేవలం రెండు కోట్ల రూపాయలతో తీయగా, 40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా సక్సెస్ తర్వాత సాయి మార్తాండ్ కు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే సాయి మార్తాండ్ తనే లీడ్ క్యారెక్టర్ చేస్తూ, 'లిటిల్ హార్ట్స్'కు సీక్వెల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.


హీరో నాని నిర్మించిన 'కోర్ట్' (Court) సినిమాతో రామ్ జగదీశ్‌ (Ram Jagadish) దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియదర్శి (Priayadarshi) హీరోగా నటించిన ఈ సినిమాను మీడియం బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా యాభై కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి చిన్న చిత్రాలకు కొత్త ఊపిరి పోసింది. హర్ష రోషన్, శ్రీదేవి ఇందులో జంటగా నటించారు. దాంతో నాని నే రామ్ జగదీశ్ తో మరో సినిమా నిర్మించబోతున్నాడట.

ఇక ఈ యేడాది మంచి లాభాలను అందుకున్న మరో సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈటీవీ విన్ సహకారంతో దర్శకుడు వేణు ఊడుగుల తన మిత్రుడుతో కలిసి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అఖిల్ రాజ్, తేజస్వీ రావ్, చైతన్య జొన్నలగడ్డ ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే సాయిలు కంపాటి రెండో సినిమా ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఈ యేడాది కొత్త దర్శకులు తెరకెక్కించిన సినిమాలలో మురళీకాంత్ తీసిన 'దండోరా' మూవీ కూడా ఉంది. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలానే రాహుల్ శ్రీనివాస్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' (The Great Pre-Wedding Show) మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తిరువీర్ (Thiruveer) హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో కంటే ఓటీటీలో మంచి ఆదరణకు నోచుకుంది. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ (Rahul Srinivas) కూ మంచి గుర్తింపు వచ్చింది.


క్రిస్మస్ కానుకగా వచ్చిన 'శాంబాల' (Shambhala) మూవీతో యుగంధర్ ముని (Yugandhar Muni) దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సీజన్ లో వచ్చిన సినిమాల్లో అదే మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యుగంధర్ ముని కథను ఆసక్తికరంగా తెరకెక్కించాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆది సాయికుమార్ (Aadi Saikumar) కు చాలా యేళ్ళ తర్వాత ఓ మంచి విజయాన్ని అందించిన యుగంధర్ ముని మీద కొందరు నిర్మాతలు దృష్టి పెట్టారు. మరి 2025లో మంచి విజయాలను, గుర్తింపును పొందిన ఈ దర్శకులు తర్వాత చిత్రాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Updated Date - Jan 06 , 2026 | 12:43 PM