థియేటర్ లో బంగారం బావుందన్నారు కదరా..
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:27 AM
ఈమధ్య ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో అస్సలు అర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. థియేటర్ లో హిట్ అన్న సినిమా ఓటీటీకి వచ్చాక ప్లాప్ అవుతోంది.
ఈమధ్య ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో అస్సలు అర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. థియేటర్ లో హిట్ అన్న సినిమా ఓటీటీకి వచ్చాక ప్లాప్ అవుతోంది. ఇక చాలామంది ఓటీటీలో చూసి.. అసలు ఈ సినిమాను థియేటర్ లో ఎలా హిట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో డిబేట్ లు నడుపుతున్నారు. తాజాగా మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) సినిమా థియేటర్ లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వందకోట్ల క్లబ్ లో చేరింది. సమంత (Samantha) ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 19 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది.
ఇక రీసెంట్ గా మా ఇంటి బంగారం ఓటీటీలోకి వచ్చింది. జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలో భారీ ట్రోలింగ్ బారిన పడింది. ఓటీటీలో ఆడియన్స్ ఈ సినిమాను వీక్షిస్తూ సోషల్ మీడియాలో దారుణమైన నెగటివ్ రివ్యూలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ సమంత పలికిన రాయలసీమ యాసపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సమంత ఫేక్ రాయలసీమ స్లాంగ్ వింటుంటే తీవ్రమైన చిరాకు వస్తోందని, అసలు ఈ యాసను ఇంత ఘోరంగా ఎలా ఖూనీ చేశారంటూ ఓటీటీ వీక్షకులు సోషల్ మీడియా వేదికగా కడిగిపారేస్తున్నారు.
అవుట్‌డేటెడ్ కథాంశం, పసలేని స్క్రీన్‌ప్లే, నటీనటుల మధ్య బలహీనమైన కెమిస్ట్రీ సినిమాను పూర్తిగా దెబ్బతీశాయని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. నేటి తరం ఓటీటీ ఆడియన్స్ వినూత్నమైన కంటెంట్‌ను కోరుకుంటున్న రోజుల్లో, ఇంతటి రొటీన్ పాతచింతకాయ పచ్చడి లాంటి ఫ్యామిలీ డ్రామాను ప్రేక్షకులపైకి వదలడం ఏంటని మేకర్స్‌ను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడమే ఈ చిత్రానికి అతిపెద్ద మైనస్‌గా మారిందని అభిప్రాయపడుతున్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు సినిమా ఎక్కడా ఆకట్టుకునే విధంగా లేదని, కొన్ని సీన్లు సహనానికి పరీక్ష పెడుతున్నాయని చెప్పుకొస్తున్నారు. మరి ఇంత నెగిటివిటీతో బంగారం ముందు ముందు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.