అభినవ్ గోమఠం.. వాడుకోండయ్యా కుర్రాడిని

ABN , Publish Date - Nov 21 , 2026 | 03:58 PM

టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న విలక్షణ నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). మైనే ప్యార్ కియా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు అభినవ్.

Abhinav Gomatam

టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్, సహజమైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న విలక్షణ నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). మైనే ప్యార్ కియా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు అభినవ్. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా ఈ నగరానికి ఏమైంది సినిమా అతని లైఫ్ ని మార్చేసింది. కౌశిక్ అనే పాత్రలో అభినవ్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఈ చిత్రం తరువాత ఇండస్ట్రీకి మరో మంచి కమెడియన్ దొరికాడు అనుకున్నారు. కానీ, ఈ కుర్రాడికి మాత్రం ఆశించినంత గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. ఇక మరోసారి అభినవ్ తన మార్క్ కామెడీతో ఈ నగరానికి ఏమైంది 2 (Ee Nagaraniki Emaindi 2) చిత్రంలో అభిమానులను పూర్తిగా ఫిదా చేశాడు. మొదటి భాగంలో కౌశిక్ గా యువతను ఉర్రూతలూగించిన అభినవ్, సీక్వెల్‌లో అంతకుమించిన ఎనర్జీ, నేచురల్ డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో థియేటర్లలో నవ్వుల తుఫాను సృష్టిస్తున్నాడు.


ఈ నగరానికి ఏమైంది 2 చూసిన ప్రేక్షకులు, సోషల్ మీడియా వేదికగా అభినవ్ గోమఠం పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలు కౌశిక్ లేకపోతే ఈ సీక్వెల్ కూడా లేదని చెప్పుకొస్తున్నారు. కామెడీ పంచాల్సిన టైమ్ లో కామెడీని పంచడమే కాకుండా క్లైమాక్స్ లో ఎమోషనల్ డైలాగ్స్ తో అందరినీ ఏడిపించాడు కూడా. అయితే, అభినవ్ లోని అసలైన నటుడిని టాలీవుడ్ దర్శకులు ఇంకా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కేవలం హీరో పక్కన ఉండే ఫ్రెండ్ పాత్రలకో, రొటీన్ కామెడీ సీన్లకో పరిమితం చేయకుండా.. అతనిలోని పూర్తిస్థాయి నటనను బయటకు తీసే బలమైన, వైవిధ్యమైన పాత్రలు ఇస్తే అభినవ్ ఏ రేంజ్‌లో చెలరేగిపోతాడో ENE 2 మరోసారి నిరూపించిందని చెప్పుకొస్తున్నారు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో అభినవ్ గోమఠం..డైరెక్టర్స్ వాడుకోండయ్యా కుర్రాడిని అంటూ నెటిజన్లు, సినీ అభిమానులు పోస్టులు పెడుతూ అతని టాలెంట్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా పండించగల సత్తా ఉన్న ఈ కుర్రాడిని దర్శకులు సరిగ్గా వాడుకుంటే టాలీవుడ్‌కు మరో అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్, లీడ్ యాక్టర్, కమెడియన్ దొరికినట్లేనని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో అభినవ్ గోమఠంకు మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ దక్కుతాయేమో చూడాలి.

Updated Date - Nov 21 , 2026 | 03:58 PM