Dasari Narayanarao: మనిషి ఉంటేనే విలువ.. దాసరికి ఇచ్చే గౌరవం ఇదేనా..
ABN , Publish Date - May 30 , 2026 | 12:28 PM
దర్శకరత్న దాసరి నారాయణరావు.. టాలీవుడ్‌కి పెద్ద పులి.. కార్మికుల పాలిట దేవుడు... అందుకే పేదలున్న చోటే తన ఇంటిని నిర్మించుకున్నారు.. సమస్య ఎక్కడుంటే ఆయన ప్రత్యక్షమై క్షణాల్లో.. నాలుగు మాటలతో పరిష్కారం చేసేవారు..
దర్శకరత్న దాసరి నారాయణరావు.. టాలీవుడ్‌కి పెద్ద..
కార్మికుల పాలిట దేవుడు... అందుకే పేదలున్న చోటే తన ఇంటిని నిర్మించుకున్నారు..
సమస్య ఎక్కడుంటే అక్కడ ఆయన ప్రత్యక్షమైన క్షణాల్లో.. నాలుగు మాటలతో పరిష్కారం చూపేవారు..
ఎదుటి వ్యక్తి ఎవరైనా.. ఎంతటి బలవంతుడైన.. వెనకడుగు వేయరు… సమస్య పరిష్కారం అవుతుంది అంటే.. ఓ మెట్టు ఎక్కడం.. కాదంటే దిగడం చేసి రెండు వైపుల సంధి చేసేవారు.
ఆయన ఉన్నంత కాలం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా.. కష్టం టాలీవుడ్ కాంపౌండ్ లోకి రాకుండా చేశారంటే అతిశయోక్తి కాదు..
అలాంటిది ఆయన కనుమరుగైన తర్వాత ఇండస్ట్రీని ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తూనే ఉంది.
మే 30, 2017న దాసరి మనకు దూరమైనారు. అప్పటి నుంచి ఆయనలేని ఇండస్ట్రీ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన విషయంలో ఓ అంశం కలచివేస్తుంది. ఎప్పుడూ ఒకరికి తలవంచకుండా… ఇండస్ట్రీని శాసించిన వ్యక్తిని అయ్యో పాపం అనుకునేలా చేశారు. ఈ రోజు దాసరి మరణించిన రోజు. పుట్టిన రోజులా… ఆయన్ను స్మరించుకున్నవారు లేరు. ఇక ఆయన సమాధికి పట్టిన గతి చూస్తే.. హృదయం చలిస్తుంది. ఇదా ఆ పెద్దాయనకు ఇచ్చే గౌరవం.. ఉన్నప్పుడేనా వైభవం… లేకుంటే పట్టించుకోరా…

ఆస్తులు కోసం కొట్టుకుంటున్న ఇద్దరు కొడుకులు ఎక్కడికిపోయారు.. ఆయన ఆస్తులు పంచుకున్న పుత్రరత్నాలకు కనీసం తండ్రి వర్ధంతి కూడా గుర్తు లేదేమో?
ఆయన ఉన్నప్పుడు గురువుగారూ.. గురువుగారూ అంటూ చుట్టూ చేరే భజన బృందం, శిష్యగణం ఏమై పోయారు?
దాసరి మరణం తర్వాత మొయినాబాద్ లో వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిగాయి. అక్కడే ఆయనకు ఓ మెమోరియల్ను నిర్మించారు. ఇప్పుడది చెత్తతో, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దానిని పట్టించుకున్న నాథుడే లేడు.. అది నిజంగా మెమోరియలేనా? అన్నట్లు తయారైంది. దాసరికే ఇలా ఎందుకు జరుగుతోందని? అని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో చెత్తాచెదారంతో నిండిన దాసరి, పద్మ సార్మక స్థలాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగానే పలువురు స్పందించారు. పరిశ్రమ కోసం ఎంతో చేసిన మహనీయుడి స్మృతికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకుడు సాయిరాజేశ్ బృందంతో పాటు మంచు మనోజ్ అనుచరగణం స్వచ్ఛందంగా శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయాన్నే వారంతా శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం మంచు మనోజ్ మొయినాబాద్ లో దాసరి స్మారక స్థలానికి చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో దాసరి స్మారకాన్ని ఆ స్థితిలో వీడియో ద్వారా చూసిన అభిమానులు చలించిపోయారు. ఇకనుంచైనా దాసరి స్మారకానికి సరైన గౌరవ మర్యాదలు దక్కాలని ఆశిద్దాం…