NBK 112: ఎన్‌బీకే 112 పూజా కార్యక్రమాలు ఎప్పుడు.. ఎక్కడ?
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:28 PM
నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! ‘ఎన్‌బీకే 112’ వర్కంగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది.
నందమూరి బాలకృష్ణ(NBK) - కొరటాల శివ (koratala shiva) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ‘ఎన్‌బీకే 112’ (NBK 112) వర్కంగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెం-టీటీడీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేసి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ హాజరుకానున్నారు. రాజకీయ, సినీ గ్లామర్ నడుమ జరగనున్న ఈ ఓపెనింగ్ వేడుక ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో హీరోలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో, అంతే హుందాగా కనిపిస్తూ మైండ్ గేమ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. మరి బాలయ్య విషయానికొస్తే... ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఊరమాస్ యాక్షన్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కలయిక అంటే.. 'కొరటాల మార్క్ పదునైన కథనానికి, బాలయ్య మార్క్ గర్జన తోడైతే" బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమనే నమ్మకం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. బాలయ్య రేంజ్ మాస్ ఎలివేషన్లకు, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ తోడు కానుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులందరినీ థియేటర్లకు రప్పించేలా ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఈ కథను కొరటాల శివ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సౌత్ ఇండియాస్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ‘ఎన్‌బీకే 111’ చిత్రం పూర్తి చేశాక ఈ సినిమా సెట్స్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. హీరోయిన్, ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ఈ రెండు సినిమాలను బాలకృష్ణ ఒకేసారి పూర్తి చేయనున్నట్లు సమాచారం