Naveen Polishetty: కొత్తగా ఈ కండీషన్స్ ఏంటి రాజు గారు
ABN , Publish Date - Jan 20 , 2026 | 07:49 PM
చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty).
Naveen Polishetty: చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty). వరుస సినిమాలతో హిట్ అందుకుంటున్న నవీన్.. ఈ ఏడాది సంక్రాంతికి అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో బాస్ సినిమా తరువాత ఎక్కువమంది అనగనగా ఒక రాజు సినిమానే బావుందని చెప్పుకొస్తున్నారు. టాక్ మాత్రమే కాదు కలక్షన్స్ కూడా ఆ రేంజ్ లోనే రాబడుతున్నాయి.
అనగనగా ఒక రాజు హిట్ తరువాత నవీన్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే ఆత్రుత అందరిలోనూ ఉంది. సంక్రాంతి హిట్ పడడంతో బడా నిర్మాతలు సైతం నవీన్ తో సినిమా చేయడానికి ఊవిళ్లూరుతున్నారు. అందులోనూ ఈ కుర్ర హీరో సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. అయితే రాజు గారు మాత్రం.. తన నెక్స్ట్ సినిమా నుంచి నిర్మాతలకు కొత్తగా కండీషన్స్ పెడుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన దగ్గరకు వచ్చిన ప్రతి నిర్మాతకు రెండు కండీషన్స్ ఉన్నాయని, వాటికి ఓకే అంటేనే సినిమా చేస్తానని చెప్పుకొస్తున్నాడట.
ఇక మొదటి కండీషన్.. రెమ్యూనరేషన్ పెంచడం. నవీన్ పోలిశెట్టి తన తదుపరి సినిమా నుంచి రూ. 15 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఇదేమి పెద్ద విషయం కాదు. ఏ హీరో అయినా ఒక సినిమా హిట్ అయ్యాకా పారితోషికం పెంచుతాడు. అది అతని మార్కెట్ ని చూపిస్తుంది. ఈ కండీషన్.. నిర్మాతలకు సమస్యే కాదు. సమస్య అంతా రెండో కండీషనే. అదేంటంటే.. సినిమా మొత్తాన్ని తానే చూసుకుంటానని, అందులో నిర్మాత జోక్యం చేసుకోకూడదని అంటున్నాడట. అంటే, నిర్మాత కేవలం డబ్బు ఇస్తే చాలు.. సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక చూపిస్తాను. అప్పటివరకు అసలు సినిమా గురించి పట్టించుకోకూడదు అని కండీషన్ పెట్టినట్లు సమాచారం.
నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టే వ్యక్తి మాత్రమే కాదు. సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసేవరకు దగ్గరుండి.. ఏం జరుగుతుంది.. ? సినిమా ఎలా వస్తుంది.. ? ఏమైనా లోపాలు ఉన్నాయా.. ? ఎవరికైనా ఇబ్బంది ఉందా.. ? ఇవన్నీ కనుక్కుంటూ సినిమాను తన భుజాలపై మోసేవాడు. అలాంటి పనినే చేయొద్దు అంటే అది చాలా కష్టం. అలాంటి కండీషన్ పెడితే.. ఏ నిర్మాత అయినా ఎలా ఒప్పుకుంటాడు. కానీ, నవీన్ మాత్రం ఈ రెండు కండీషన్స్ ఒప్పుకుంటున్నట్లు అగ్రిమెంట్ చేశాకే సినిమాకు సైన్ చేస్తాడంట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.