Sharwa: ఆత్రేయ పురం పూతరేకుల్లాంటి 'నారీ నారీ నడుమ మురారి'...
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:57 PM
సంక్రాంతి కానుకగా రాబోతున్న 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం ట్రైలర్ ను ఆత్రేయపురంలో విడుదల చేశారు. ఈ ఊరితో తనకు గొప్ప అనుబంధం ఉందని శర్వా తెలిపాడు.
ఛార్మింగ్ స్టార్ శర్వా తాజా చిత్రం 'నారీ నారీ నడుమ మురారి' ఈ నెల 14వ తేదీ సాయంత్రం థియేటర్లలో సందడి చేయబోతోంది. 'సామజవర గమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఆత్రేయ పురంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వా మాట్లాడుతూ, 'మీ అందరినీ చూశాక ఈ సినిమాకి 'మంచి ఆత్రేయపురం పూతరేకులు లాంటి సినిమా' అనే ట్యాగ్ లైన్ పెట్టాలనిపించింది. ఇది నాకు చాలా ఇష్టమైన ఊరు. 'శతమానం భవతి' షూటింగ్ ఇక్కడే చేశాం. దాదాపు మూడు నెలలు ఇక్కడే ఉన్నాను. 'నారీ నారీ నడుమ మురారి' సినిమా మీ అందరిని హ్యాపీగా నవ్వించాలని తీసింది. అన్నిట్లోకి అద్భుతమైనది నవ్వు. ప్రతి ఇంట్లో నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి. అందరూ కూడా మా సినిమాకు వచ్చి ఆనందంగా నవ్వితే అదే మాకు పండగ. అది మీరందరూ మాకు ఇచ్చే కానుక. ఇది చాలా క్లీన్ ఫిలిం. ఈ సినిమా టికెట్ ధరలని మేం పెంచడం లేదు. అందరికీ అందుబాటులో వున్న ధరలే వుంటాయి' అని అన్నారు.
'నారీ నారీ నడుమ మురారి' సినిమా తనకో మెమొరబుల్ జర్నీ అని హీరోయిన్ సాక్షి వైద్య తెలిపింది. ఇందులో నేను దియా అనే పాత్రను చేశాను. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుందని మరో హీరోయిన్ సంయుక్త తెలిపింది. శర్వాతో 'మహా సముద్రం' మూవీ చేసిన దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ, 'ఇది మా అమ్మమ్మగారి ఊరు. శర్వా చాలా ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నాడు. ఈ సినిమాలో తాను నాలుగు మంచి పాటలు రాశానని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తెలిపాడు.