‘ద ప్యారడైజ్’ విడుదల వేళ.. నాని వైఫ్ ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:06 PM
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘ద ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా, ఆయన సతీమణి అంజనా యలవర్తి సోషల్ మీడియాలో పెట్టిన భావోద్వేగ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) తాజా చిత్రం ‘ద ప్యారడైజ్’ (The Paradise) ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా, ఆయన సతీమణి అంజనా యలవర్తి (Anjana Yelavarthy) సోషల్ మీడియాలో పెట్టిన భావోద్వేగ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాని కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు సాగిన 17 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు కాలేజ్ బంక్ కొట్టి ఆయన సినిమా చూసేందుకు వెళ్లిన నాటి రోజులను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నెమరువేసుకున్నారు.
ఆమె తన పోస్ట్‌లో.. ‘‘నాకిప్పటికీ గుర్తుంది, 2009లో మేం కొద్దిమందిమి కాలేజీ బంక్ కొట్టి మీ సినిమా చూడ్డానికి వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది ఏంటంటే.. రిలీజ్ రోజున మార్నింగ్ షో కూడా పడలేదు. ఒక కొత్త నటుడు తన సినిమాను సమయానికి థియేటర్లలోకి తీసుకురావడం ఎంత కష్టమో అప్పుడు నేను అనుకున్నాను. సరిగ్గా 17 ఏళ్ల తర్వాత, సినిమా సినిమాకూ మీరు నిర్మించుకున్న నమ్మకంతోనే ప్రజలు ఈరోజు ‘ద ప్యారడైజ్’ కోసం తరలిరావడం చూస్తుంటే ఎంతో భావోద్వేగంగా, కృతజ్ఞతగా అనిపిస్తోంది. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మితం కాలేదు.. మీ ఈ ప్రయాణానికి నేనే సాక్ష్యం’’ అని పేర్కొన్నారు.

అలాగే నాని సినిమాలపై మాట్లాడిన అంజనా.. ‘‘మీ ప్రతి సినిమా మీకో బిడ్డ లాంటిదని నేను చూస్తూనే ఉన్నాను. కొన్ని నడిచాయి, కొన్ని పరుగెత్తాయి, ఇంకొన్ని దారిలో ఎదురుదెబ్బలు తగిలించుకున్నాయి. ఎలా ఉన్నా సరే.. అదెప్పటికీ మీ బిడ్డే. ఈ రాత్రికి ‘ద ప్యారడైజ్’ తన తొలి అడుగులు వేస్తోంది. ఏది జరిగినా సరే, అంతా మంచే జరుగుతుంది.. ఇట్స్ గోయింగ్ టు బి గుడ్.. అంతే! మీకు మేమంతా ఎప్పటికీ అండగా ఉంటాం’’ అంటూ నానిపై ఉన్న ప్రేమను, నమ్మకాన్ని ఎమోషనల్‌గా అంజనా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నాని ఫ్యాన్స్ ఈ పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు. ఇక ‘ద ప్యారడైజ్’ చిత్రం బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రికి మొదలయ్యే ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉద్రిక్తత.. జానీ మాస్టర్ భార్య పై దాడి
యూఎస్ మార్కెట్‌లో ‘ద ప్యారడైజ్’ రికార్డు.. మహేష్ సరసన నాని!
46 కోట్లు.. రాధ ఫిర్యాదుపై సోదరి అంబిక సవాల్