'ది ప్యారడైజ్' సునామీ.. తొలి రోజే రూ.88 కోట్ల గ్రాస్
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:25 PM
రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన ది ప్యారడైజ్ సినిమా తొలిరోజు వసూళ్లలోనూ తన సత్తా చాటింది.
ఒకప్పుడు నాని అనగానే.. క్లాస్ సినిమాలు, పక్కింటి అబ్బాయి తరహా పాత్రలు, క్లీన్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే గుర్తొచ్చేవి. కానీ 'దసరా' సినిమాతో నాని తన రూట్ మార్చాడు. తనలోని మాస్, వయెలెంట్ యాంగిల్‌ని పరిచయం చేస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు అదే కాంబినేషన్.. 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని చేసిన తాజా చిత్రం 'ది ప్యారడైజ్'. మొదటి నుంచే భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం, టీజర్, అనిరుధ్ పాటలతో హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళింది. మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటించిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్, గురువారం థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు సృష్టించిన 'ది ప్యారడైజ్', తొలి రోజే బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకుంది. పెయిడ్ ప్రిమియర్లతో కలుపుకుని ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి సినిమాస్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. "సరికొత్త జమానాకు బ్లాక్‌బస్టర్ ఆరంభం.. ఈ జమానాలోకి అడుగుపెట్టండి, పిచ్చెక్కిపోయే అనుభూతిని సొంతం చేసుకోండి" అంటూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.

ఇక ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ నాని స్టామినా ఏంటో ఈ సినిమా మరోసారి చాటిచెప్పింది. కేవలం ప్రిమియర్లతో కలిపి తొలి రోజున ఓవర్సీస్‌లో 2.25 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాపై అక్కడక్కడా మిక్స్‌డ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ, థియేటర్ల వద్ద మాత్రం పండగ వాతావరణం కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా పటిష్టంగా ఉండటంతో వీకెండ్‌లో ఈ కలెక్షన్ల హోరు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
'ది ప్యారడైజ్' సాధించిన ఈ భారీ ఓపెనింగ్స్‌తో నాని బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసుకున్నాడు. గతంలో నాని నటించిన 'హిట్-3' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా, 'దసరా' మూవీ రూ. 38 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు 'ది ప్యారడైజ్' ఏకంగా రూ. 88 కోట్లతో ఆ పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి, నాని మాస్ స్టామినాను నిలబెట్టింది. ఈ సినిమాలో జడల్ క్యారెక్టర్ లో నాని విశ్వరూపం, శ్రీకాంత్ ఓదెల టేకింగ్ ప్రేక్షకులను థియేటర్లలో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతున్నాయి. ఇక రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ఆయా షేర్, ఏషనాగుల పాటలొస్తుంటే ఆడియన్స్ డాన్సులు చేస్తున్నారు. ఇక సినిమాలో కేసీఆర్ రిఫరెన్స్‌తో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ అన్న పాత్రకు థియేటర్లలో ఊహించని రెస్పాన్స్ వస్తోంది. టాక్‌తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న 'ది ప్యారడైజ్' ఫుల్ రన్‌లో ఎన్ని వందల కోట్ల కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే.