Nani: పరాజయాలతో నాని రూట్ మారిందా..?

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:04 PM

టాలీవుడ్‌లో విభిన్నమైన కథలు, సహజమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నాని. ఇప్పుడు కథల ఎంపికలో కొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌లో విభిన్నమైన కథలు, సహజమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నాని. ఇప్పుడు కథల ఎంపికలో కొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన కథలతో అలరించిన ఆయన, కొంతకాలంగా మాస్ ఇమేజ్‌పై దృష్టి పెట్టారు. ‘దసరా’తో వచ్చిన క్రేజ్‌తో ప్రయోగాత్మక చిత్రాల వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ వంటి సినిమాల్లో రక్తపాతం, హింసతో కూడిన పాత్రలు పోషించారు.

అయితే, వరుసగా యాక్షన్ నేపథ్యంలో సినిమాలు చేయడం వల్ల తన నేచురల్ స్టార్ ఇమేజ్‌కు దూరమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో తదుపరి ప్రాజెక్టుల విషయంలో నాని కొత్త నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపై కొంతకాలం తీవ్రమైన హింస, రక్తపాతంతో కూడిన సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. కుటుంబ సభ్యులంతా కలిసి చూసి ఆస్వాదించే చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.

ఏదైనా వేడుకకు వెళ్లినప్పుడు పిల్లలు తనను చూసేందుకు పరుగెత్తుకొస్తారని, అందుకే వారితో పాటు కుటుంబమంతా ఆస్వాదించే సినిమాలు చేయాలనే ఆలోచన ఉందని నాని గతంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ చేస్తున్నారు. ఇందులో యాక్షన్ ఉన్నప్పటికీ, గత చిత్రాల తరహాలో కాకుండా స్టైలిష్‌గా, వినోదభరితంగా ఉంటుందని నాని వెల్లడించారు. ఈ సినిమా తర్వాత ఓ అందమైన ప్రేమకథలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘96’ దర్శకుడితో భావోద్వేగ ప్రేమకథ?

తదుపరి సినిమాల విషయంలోనూ నాని కొన్ని మార్పులు చేసుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఒక సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించిన ఆయన, ఇకపై తక్కువ వ్యవధిలో పూర్తయ్యే ప్రాజెక్టులను ఎంచుకోవాలని భావిస్తున్నారట. తమిళంలో ‘96’, ‘సత్యం సుందరం’ వంటి భావోద్వేగభరిత చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ చెప్పిన ఓ కథ నానికి బాగా నచ్చిందని, ఈ ప్రాజెక్టుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అదే నిజమైతే నాని మరోసారి తన సహజమైన నటనతో ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసే అవకాశం ఉంది. మొత్తానికి మాస్ ప్రయోగాల తర్వాత నాని మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ, లవ్ ఎంటర్‌టైనర్స్ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది.

Updated Date - Nov 28 , 2026 | 01:01 PM