రెండేళ్లుగా ఒత్తిడిలో ఉన్నా.. నాని దేవుడిలా వచ్చాడు! ఈసారి బరాబర్ హిట్ ఇస్తున్నా
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:20 PM
నితిన్, ఆఫియా జంటగా నటించిన అలియాస్ రుక్మిణి డిసెంబర్ 4న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ తన రెండేళ్ల సినీ ప్రయాణంలోని ఒత్తిడిని గుర్తుచేసుకుంటూ నాని ఇచ్చిన కథపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ఒక నటుడిగా రెండేళ్ల నుంచి ఒత్తిడిలో ఉన్నాను. సరైన సినిమాలు, కథలు రావడం లేదు. నిద్రలేని రాత్రులు కూడా గడిపాను. ఈ కథ విన్ననాటి నుంచి హాయిగా నిద్రపోయాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిలా నాని బాబు వచ్చి ఈ కథను నా చేతిలో పెట్టారు. నేను ఉన్న పరిస్థితుల్లో ఒక బంగారు పళ్లెం తీసుకొచ్చి నా చేతిలో పెట్టినట్టుగా అనిపించింది. డిసెంబరు 3వ తేదీ రాత్రి ప్రీమియర్స్ ఉంటాయి. ఈసారి బరాబర్ హిట్ ఇస్తున్నా' అని నితిన్ (Nithiin) అన్నారు.
నితిన్ ఆఫియా (Afiya) జంటగా ముళీకాంత్ దేవసోత్ తెరకెక్కించిన అలియాస్ రుక్మిణి (Alias Rukmini) చిత్రం డిసెంబరు 4న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిత్ర సమర్పకుడు నాని (Natural Star Nani) మాట్లాడుతూ 'ఒక నిర్మాతగా ఈ సినిమా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కంటెంట్ విషయంలో చాలా తృప్తిగా ఉంది. రిలీజ్కు ముందు ఎలాంటి టెన్షన్ లేదు. కృష్ణ పాత్రలో నితిన్ తప్ప మరొకరిని ఊహించుకోలేక పోయాను. ఈ సినిమాలో భాగం కావడం నిజంగా నా అదృష్టం. అందరూ తప్పకుండా చూడండి' అని కోరారు.
'ఈ సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను. నాని గారు సినిమా చూసి 'చాలా అద్భుతంగా తీశావ్ భయ్యా' అని మెచ్చుకోవడం నా జీవితంలో మర్చిపోలేను' అని దర్శకుడు మురళీకాంత్ (Murali Kanth) అన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 'నాని సక్సెస్ఫుల్ హీరోగా ఉంటూ మరో హీరోతో సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. తను ఈ విషయంలో సక్సెస్ అవుతున్నారు' అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఆఫియా, నిర్మాతలు దీప్తి గంటా, వెంకట్ బోయినపల్లి, డైరెక్టర్లు శైలేష్ కొలను, రాహుల్ సాంకృత్యన్. వెంకీ అట్లూరి పాల్గొన్నారు.