NBK112: బాలయ్య, కొరటాల సినిమా షురూ! బడ్జెట్.. ఎంతో తెలుసా?
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:38 AM
చాలా రోజులుగా వార్తల్లో ఉన్న బాలకృష్ణ, కొరటాల శివ చిత్రం ఎట్టకేలకు ప్రారంభం అయింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన, తాజాగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కలయికలో రూపొందుతున్న 'NBK112' ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ ముహూర్తపు వేడుకకు ఏపీ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తొలి క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని, అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయేలా, ఒక సరికొత్త కథాంశంతో ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పష్టం చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలయ్య కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రంగా నిలవనుంది.
బాలకృష్ణ ఊరమాస్ ఇమేజ్‌కు, సామాజిక సందేశాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పవర్‌ఫుల్‌గా చూపించే కొరటాల శివ మార్క్ టేకింగ్ తోడవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘సింహా’ సినిమాకు కొరటాల శివ రచయితగా పనిచేశారు. ఆ సినిమాలో బాలయ్య డైలాగ్స్, క్యారెక్టరైజేషన్ ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ దర్శకుడు - నటుడిగా చేతులు కలపడం నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నుంచే ప్రారంభం కానుంది. అంతేకాకుండా 2027 సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజా ప్రకటనతో NBK112 చిత్రం 2027 వేసవి రేస్‌లోకి అధికారికంగా అడుగుపెట్టినట్లయింది. బాలయ్య రేంజ్‌కు తగ్గ భారీ యాక్షన్ విజువల్స్‌తో కొరటాల శివ ఈ సినిమాను అద్భుతంగా మలిచే పనిలో పడ్డారు. మరి ఈ సినిమాతో బాలయ్య, కొరటాల శివ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.