బాలయ్య.. ఇదెక్కడి స్పీడు! బుల్లెట్ ట్రైన్.. దిగదిడుపే
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:59 PM
గోపీచంద్ మలినేనితో చిత్రం సెట్స్ మీద ఉండగానే బాలయ్య తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. బాలయ్యను సరికొత్త మాస్ అవతారంలో చూపించేలా గోపీచంద్ పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ జరుపుతున్నారు.
కథలో ఇంటెన్సిటీతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. చిత్ర బృందం ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆలస్యమైతే, సంక్రాంతి 2027ని బ్యాకప్ రిలీజ్ డేట్‌గా భావిస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం చిత్రం సెట్స్ మీద ఉండగానే, బాలయ్య తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా వివేక్ ఆత్రేయ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వివేక్ ఆత్రేయ తన విలక్షణమైన కథాకథనాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తన సాధారణ కమర్షియల్ శైలికి భిన్నంగా, కొత్త తరహా నెరేటివ్ ఉన్న కథ కావాలని కోరుకోవడంతో, వివేక్ చెప్పిన స్క్రిప్ట్ ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం. ఈ కాంబినేషన్ కుదిరితే బాలయ్య కెరీర్‌లో ఇది ఒక వెరైటీ మూవీగా నిలుస్తుంది.
మరోవైపు 'నాంది', 'ఉగ్రం' వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విజయ్ చెప్పిన కథ బాలకృష్ణను ఇంప్రెస్ చేయడమే కాకుండా, సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఈ సినిమాను ఒక పరిమిత బడ్జెట్‌లో, తక్కువ సమయంలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. ఇది ఒక ప్రాక్టికల్ ఆప్షన్‌గా ఉండటంతో, గోపీచంద్ మలినేని సినిమా తర్వాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత చిత్రం షూటింగ్ పూర్తయ్యాకే బాలయ్య తన ఫైనల్ కాల్ ఇవ్వనున్నారు.
గతంలో హరీష్ శంకర్‌తో ఒక ప్రాజెక్ట్ చర్చలకు వచ్చినప్పటికీ, కొన్ని సమీకరణాల వల్ల ఆ కాంబినేషన్ ప్రస్తుతానికి పక్కకు వెళ్ళిందట. ముఖ్యంగా 'అఖండ 2' తర్వాత బాలకృష్ణ తన కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో గోపీచంద్ మలినేనితో చేయాలనుకున్న హిస్టారికల్ ఫిల్మ్‌ను భారీ బడ్జెట్ కారణాల దృష్ట్యా పక్కన పెట్టి, ప్రస్తుత కమర్షియల్ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం ఆయన మారిన ఆలోచనా విధానానికి నిదర్శనం. రిస్క్ కంటే సేఫ్ జోన్‌లో ఉంటూనే ప్రేక్షకులను మెప్పించే కథలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని బాలకృష్ణ తీసుకునే తదుపరి నిర్ణయాలు ఆయన కెరీర్‌లోని తదుపరి దశను శాసించనున్నాయి. అభిమానులు మాత్రం బాలయ్య నుండి మరో పవర్‌ఫుల్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.