Nandamuri Balakrishna: బాలయ్యకు.. అడ్డేది! సినిమాలే కాదు.. యాడ్స్‌లోనూ దుసుకుపోతున్న నటసింహం
ABN , Publish Date - Jan 09 , 2026 | 10:46 PM
నటసింహం నందమూరి బాలకృష్ణ అన్విత గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.
ఏ ముహుర్తానా.. లెజెండ్, అఖండ సినిమాలు వచ్చాయో ఆపై ఒక దాని మించి మరోటి మంచి విజయాలు సాధించిడంతో పాటు, అన్ స్టాపబుల్ షోతో ఒక్కసారిగా రూట్ మార్చి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తున్నాడు నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna). తన కెరీర్‌లోనే ఊహించనంత క్రేజ్‌తో దూసుకుపోతున్న బాలయ్య అడ్వర్టైజ్‌మెంట్లలోనూ మిగతా వారిని కాదని జెట్ స్పీడులో చెలరేగి పోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా.. అన్విత (Anvita) గ్రూప్‌కు నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన వెల్లడించారు. ఈ సందర్భంగా అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా.. అచ్యుతరావు బొప్పన మీడియాతో మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన బాలకృష్ణ సినీ ప్రస్థానం, అలాగే విద్య, వైద్య రంగాల్లో ఆయన చేస్తున్న సేవలు సమాజానికి మార్గదర్శకమని ప్రశంసించారు. మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గని వ్యక్తిత్వం, నిబద్ధతతో కూడిన జీవన విధానం అన్విత గ్రూప్ విలువలకు సరిగ్గా సరిపోతుందని తెలిపారు. అందుకే బాలకృష్ణను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. ‘బిల్డ్ హ్యాపినెస్’ అనే నినాదంతో ప్రజలకు సంతోషభరితమైన జీవనాన్ని అందించడమే అన్విత గ్రూప్ లక్ష్యమని చెప్పారు. ఆ భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రతినిధిగా బాలకృష్ణ నిలుస్తారని అభిప్రాయపడ్డారు.

గత రెండు దశాబ్దాలుగా దుబాయ్, అబూదాబిలో నివాస, వాణిజ్య, హాస్పిటాలిటీ రంగాల్లో సుమారు 4 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేసిన అన్విత గ్రూప్, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో ఆధునిక లైఫ్‌స్టైల్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోందని వివరించారు. హైదరాబాదులో మూడు ప్రధాన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 80 లక్షల చదరపు అడుగుల నిర్మాణం కొనసాగుతోందన్నారు. కొల్లూరులోని అన్విత ఇవానా ప్రాజెక్ట్‌కు షెడ్యూల్‌కు ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావడం సంస్థకు ప్రత్యేక ఘనతగా పేర్కొన్నారు. తొలి దశలో 400 యూనిట్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు. అలాగే అన్విత హై నైన్, మేడ్చల్‌లోని అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టులు నగర జీవనశైలికి కొత్త ప్రమాణాలు నెలకొల్పనున్నాయని చెప్పారు.
భవిష్యత్ విస్తరణలో భాగంగా హైదరాబాద్ పరిసరాలతో పాటు విజయవాడ, విశాఖ నగరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నగరంలోనే అత్యంత ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే 5–6 ఏళ్లలో ప్రతి ఏడాది సుమారు వెయ్యి యూనిట్లు వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అన్విత గ్రూప్ డైరెక్టర్లు నాగభూషణం బొప్పన, శ్రీకాంత్ బొప్పన, విజయరాజు, హ్యాపీ హోమ్స్ డైరెక్టర్ మురళితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.