ఒడిస్సీ చూసి నేర్చుకోండి.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 20 , 2026 | 09:41 PM
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన లెనిన్ (Lenin) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. అయ్యగారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన లెనిన్ (Lenin) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. అయ్యగారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పది రోజుల్లో 80 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఇక లెనిన్ ఇంత పెద్ద విజయం సాధించడంతో మేకర్స్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ వేడుకలో అక్కినేని హీరోలు.. ముగ్గురు ఒకే వేదికపై కనిపించి కనువిందు చేశారు. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌లో అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఫోన్ చేసి మాట్నీ నుంచి షోస్ యాడ్ చేస్తున్నాం అని చెప్తుంటే వినడం చాలా సంతోషంగా ఉందని, రివ్యూల కంటే ఈ ఫోన్ కాల్స్ కోసమే తాము ఎదురుచూస్తామని చెప్పుకొచ్చారు.
"ఈ రకమైన విజయం కోసం, అభిమానుల అరుపుల కోసం అఖిల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. నాకూ, చైతన్యకి, అఖిల్‌కి ఇది పండగలా ఉంది.. మా ఇల్లంతా కళకళలాడుతోంది. ఈ సందర్భంగా చిత్రానికి పనిచేసిన రైటర్ సత్యానంద్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని' చెప్పారు. ఇక ఇదే వేదికపై సినిమాల విడుదల తేదీలు, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యంపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ మేకర్స్ అందరూ ఒడిస్సీ సినిమాను చూసి నేర్చుకోవాలని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
"హాలీవుడ్‌లో ఒడిస్సీ అనే సినిమాకి ఏడాది కిందటే రిలీజ్ డేట్ ప్రకటించి, చెప్పిన తేదీకే విడుదల చేశారు. కానీ మనం రిలీజ్ డేట్ ప్రకటించినా ఆ టైమ్‌కి రిలీజ్ చేయలేకపోతున్నాం. లెనిన్ విషయంలో కూడా జూన్ 26 అనుకుని టెక్నికల్ వర్క్ పూర్తి కాక రెండు వారాలు రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. రెండు వారాల ముందే కంటెంట్‌ను పోస్ట్ ప్రొడక్షన్ టీమ్‌కి ఇస్తే సినిమాను ఇంకా ఎక్కడికో తీసుకెళ్తారు. కానీ మనం లాస్ట్ మినిట్ వరకు కరెక్షన్లంటూ ఆలస్యం చేస్తున్నాం. డైరెక్టర్లు, టెక్నీషియన్లు, నిర్మాతలు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా.. రెండు వారాల ముందే ఇవ్వండి'అని కోరారు.
గతంలో నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య లాంటి తమ సొంత సినిమాల సమయంలో దాదాపు నెల రోజుల ముందే రిలీజ్ కాపీని చూసుకునేవాళ్లమని, ఇప్పుడు అలా ఎందుకు చూడలేకపోతున్నామనేదే తాను వేసుకుంటున్న ప్రశ్న అని, ప్రకటిస్తున్న తేదీకి అందరూ సినిమాలను విడుదల చేస్తేనే ఇండస్ట్రీకి, సినిమా ఆరోగ్యానికి బాగుంటుందని చెప్పుకొచ్చారు. రిలీజ్ డేట్లపై నాగ్ చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.