కీలక సన్నివేశాల చిత్రీకరణలో 'లాటరీ కింగ్'
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:30 PM
అక్కినేని నాగార్జున వందవ చిత్రం 'లాటరీ కింగ్' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మైసూర్‌లోని చారిత్రక కట్టడాల వద్ద ఈ సినిమా చిత్రీకరణ జరుపబోతున్నారు.
తెలుగు సీనియర్ స్టార్ హీరోలలో ఈ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కాస్తంత వెనకపడ్డారు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) గత కొంత కాలంగా అప్రతిహతంగా విజయపథంలో సాగుతున్నారు. అలానే వెంకటేశ్ (Venkatesh) గత యేడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో సీనియర్ స్టార్ హీరోల గత చిత్రాల రికార్డులను తిరగ రాశారు. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు'లోనూ కీలకపాత్ర పోషించి మరో ఘన విజయాన్ని అందుకున్నారు. అలానే చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ఈ సినిమా ఆయన్ని కూడా చాలా కాలం తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఆ రకంగా చూసినప్పుడు టాలీవుడ్‌లోని సీనియర్ స్టార్ హీరోలలో నాగార్జునే కాస్తంత వెనకబడినట్టు. నాగార్జున తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ఇటీవల రజనీకాంత్ (Rajinikanth) 'కూలీ'లోనూ, ధనుష్ (Dhanush) 'కుబేర' చిత్రంలోనూ కీలక పాత్రలు పోషించారు. కానీ ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. దాంతో ఆయన వందవ చిత్రమీద ఫోకస్ పెట్టారు. తమిళ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు 'లాటరీ కింగ్' అనే పేరు అనుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా టీమ్ కర్నాటకలోని మైసూర్ వెళుతోంది. అక్కడి చారిత్రక కట్టడాల నేపథ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొంటారని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత టబు ఈ సినిమాలో నాగార్జునతో పాటు నటిస్తోంది. అలానే శ్రీలీల కూడా ఈ సినిమాలో ఉందని అంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు చివర సినిమా 'మనం'లో ఆయనతో పాటు నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. అఖిల్ సైతం అందులో అతిథి పాత్రలో మెరిశాడు. ఇది నాగార్జున నటిస్తున్న వందవ చిత్రం కావడంతో ఆయన కొడుకులిద్దరూ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మెరియబోతున్నారని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'లాటరీ కింగ్'లో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకూ బాగానే స్కోప్ ఉందట. మరి ఈ సినిమాతో హీరోగా నాగార్జున తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి.