సమ్మర్ సీజన్‌లో బ్యాడ్ బాయ్ కార్తీక్!

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:05 PM

నాగశౌర్య తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్‌ కార్తీక్‌' రిలీజ్‌ డేట్ ఖరారైంది. ఈ సినిమా థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్‌ హక్కుల్ని జీ స్టూడియోస్‌ సంస్థ సొంతం చేసుకుంది.

Naga shaurya Bad Boy Karthik

హీరో నాగశౌర్య (Naga Shaurya) నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ 'బ్యాడ్ బాయ్‌ కార్తీక్‌' (Bad Boy Karthik). అయితే ఈ సినిమాలో అక్కాతమ్ముళ్ళ అనుబంధానికీ పెద్ద పీట వేశారు దర్శకుడిగా పరిచయం అవుతున్న రామ్ దేశినా (రమేశ్‌). ఈ సినిమాను శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమాకు హారిష్ జయరాజ్‌ సంగీతం అందించడం విశేషం. ఈ మూవీతో విధి (Vidhi) హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అలానే శ్రీదేవి విజయ్‌ కుమార్ (Sridevi Vijaykumar)... నాగశౌర్య సోదరిగా కీలక పాత్రలను పోషించింది. ఇతర ప్రధాన పాత్రలలో సుమతిరకని, నరేశ్‌ వి.కె. సాయికుమార్‌, మైమ్ గోపీ, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్‌ తదితరులు నటిస్తున్నారు.


bad.jpg

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి ప్రకటించారు. ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా నచ్చి థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్ రైట్స్‌ను జీ స్టూడియోస్ సంస్థ సొంతం చేసుకుందని ఆయన తెలిపారు. సమ్మర్‌ సీజన్‌లో వస్తున్న సినిమాలలో 'బ్యాడ్ బాయ్‌ కార్తీక్‌' తన ప్రత్యేకతను నిలుపుకుంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ సైతం ఆసక్తికరంగా ఉంది. జీ స్టూడియోస్‌ ఫ్యాన్సీ ఆఫర్‌తో మూవీ హక్కుల్ని సొంతం చేసుకోవడం కూడా ఫిల్మ్ నగర్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. కంటెంట్‌ను నమ్మి జీ స్టూడియోస్ ఈ ఆఫర్ ఇచ్చిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి 'బ్యాడ్ బాయ్‌ కార్తీక్‌'గా నాగశౌర్య ఏమేరకు ఆడియెన్స్‌ను మెప్పిస్తాడో చూడాలి.

Updated Date - Mar 27 , 2026 | 01:05 PM