ఒకేబాటలో చిరంజీవి 'విశ్వంభర'.. నాగ చైతన్య 'వృషకర్మ'
ABN , Publish Date - Aug 19 , 2026 | 09:03 PM
'విజువల్ ఎఫెక్ట్స్' లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా సాగడం లేదు. ఇక ఫాంటసీ మూవీస్ లో గ్రాఫిక్స్ తప్పనిసరి.
'విజువల్ ఎఫెక్ట్స్' లేకుండా ప్రస్తుతం తెలుగు సినిమా సాగడం లేదు. ఇక ఫాంటసీ మూవీస్ లో గ్రాఫిక్స్ తప్పనిసరి. వీఎఫ్ఎక్స్ కారణంగా పలు సినిమాల బడ్జెట్ పెరుగుతోంది. వీటివల్లే కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ తారుమారవుతున్నాయి. వీఎఫ్ఎక్స్ కారణంగానే రెండు ఫాంటసీ పిక్చర్స్ నత్త నడకన పయనిస్తున్నాయట. ఆ రెండు సినిమాలేవో?
రీ-వర్క్.. అసలు కారణం
అభూతకల్పనలతో తెరకెక్కే చిత్రాలకు గ్రాఫిక్స్ మాయాజాలం అత్యంత అవసరం. 'వీఎఫ్ఎక్స్' వర్క్ సవ్యంగా సాగితే అనుకున్న సమయానికే సినిమాలను రిలీజ్ చేయవచ్చు. అందులో ఓ సారి జాప్యం చోటు చేసుకుంటే చాలు- విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ పోవలసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన విశ్వంభర (Vishwambhara) చిత్రం వాస్తవానికి గత యేడాది సంక్రాంతి సంబరాలకే రావలసింది.
ఆ సమయంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం తాము బరి నుండి తప్పుకుంటున్నామని ప్రకటించారు మేకర్స్. తరువాత వేసవికి వస్తుందని, ఆ పై దసరాకు రానుందని టముకు సాగింది. కానీ, 'విశ్వంభర' ఇప్పటికీ వెలుగు చూడలేదు. కారణమేంటంటే- 'విశ్వంభర' కోసం ఇంతకు ముందు చేయించిన గ్రాఫిక్ వర్క్ అంత ఎఫెక్ట్ గా లేకపోవడంతో మొత్తం మళ్ళీ రిపీట్ చేయవలసి వచ్చిందట. అందువల్లే 'విశ్వంభర' పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 16న రిలీజ్ కానుందని తెలుస్తోంది.
సేమ్ సీన్.. సేమ్ సీజన్
'విశ్వంభర'లాగే నాగచైతన్య హీరోగా కార్తిక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో బీవీయస్.యన్. ప్రసాద్ నిర్మిస్తోన్న వృషకర్మ (Vrushakarma) కూడా విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమవుతోందని సమాచారం. ఈ సినిమా మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతోంది. కాబట్టి గ్రాఫిక్ వర్క్ అత్యవసరం. అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వీఎఫ్ఎక్స్ రూపొందించాలని మేకర్స్ భావించారు. అందువల్ల రాజీ పడకుండా విజువల్ ఎఫెక్ట్స్ సిద్ధం చేస్తున్నారు. దాంతో ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ విజువల్ ఎఫెక్ట్స్ పూర్తయితే అక్టోబర్ లో దసరా సీజన్ లో 'వృషకర్మ'ను రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్.
ఆ ఇద్దరు.. ఈ ఇద్దరు
'విశ్వంభర' దర్శకుడు వశిష్ఠ, 'వృషకర్మ' డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు - ఇద్దరూ ఇంతకు ముందు చిత్రాలతో బంపర్ హిట్స్ పట్టేసినవారే. 'విశ్వంభర'కు ముందు వశిష్ఠ తెరకెక్కించిన కళ్యాణ్ రామ్ 'బింబిసార' విజయంలో వీఎఫ్ఎక్స్ పాత్ర ఎంతో ఉంది. ఇక కార్తిక్ వర్మ దండు గత చిత్రం 'విరూపాక్ష' కూడా భూతాల కథతో తెరకెక్కి విజువల్ ఎఫెక్ట్స్ తో అలరించింది. ఆ సినిమాలు కూడా ఫాంటసీ మూవీస్ కావడం, సదరు చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఎంతో అట్రాక్టివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది.
అలాగే 'విశ్వంభర' హీరో చిరంజీవి ప్రీవియస్ మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు', 'వృషకర్మ' కథానాయకుడు నాగచైతన్య గత చిత్రం 'తండేల్' బంపర్ హిట్స్ చూశాయి. ఆ కారణంగానూ రాబోయే 'విశ్వంభర','వృషకర్మ' చిత్రాలకు బజ్ నెలకొంది. ఓ వైపు వశిష్ఠ, మరోవైపు కార్తిక్ వర్మ దండు ఇద్దరూ గ్రాండ్ సక్సెస్ చూసినా, ఇప్పుడు తెరకెక్కిస్తున్న చిత్రాల ద్వారా సవాల్ ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. రెండు సినిమాలూ 'విజువల్ ఎఫెక్ట్స్' కారణంగానే ఆలస్యమవుతున్నాయి. మరి ఈ చిత్రాలు ఏ సమయంలో జనం ముందుకు వస్తాయో? ఏలాంటి ఫలితం సాధిస్తాయో చూడాలి.