వరుస బ్లాక్‌బస్టర్స్ మిస్సయిన చైతూ.. ఇప్పటికైనా ఆ దర్శకుడికి ఓకే చెబుతాడా
ABN , Publish Date - Aug 20 , 2026 | 06:38 PM
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య వరుసగా బ్లాక్‌బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) వరుసగా బ్లాక్‌బస్టర్ విజయాలను చేతులారా వదులుకున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కింగ్ నాగార్జునకు వీరాభిమాని అయిన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే, వెంకీ అట్లూరి ఇప్పటివరకు తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల కథలన్నీ మొదట వెళ్లింది అక్కినేని కాంపౌండ్‌కేనట. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలతో పాటు ఇతర హీరోలతో తీసి భారీ హిట్స్ కొట్టిన ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ కథలను కూడా తొలుత నాగచైతన్యకే వినిపించారట. అయితే వేర్వేరు కారణాలతో చైతూ వాటన్నింటినీ రిజెక్ట్ చేసినట్లు స్వయంగా వెంకీ అట్లూరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వెంకీ తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఆయన పేరు మార్మోగిపోతోంది.
ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ ఆయన కెరీర్‌లో 24వ చిత్రంగా రూపొందుతోంది. దీని తర్వాత చైతూ చేయబోయే ల్యాండ్‌మార్క్ 25వ సినిమా (సిల్వర్ జూబ్లీ ఫిల్మ్) బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై అక్కినేని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి పేరు మరోసారి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. కథల ఎంపికలో వైవిధ్యం చూపుతూ వరుస హిట్స్‌తో గోల్డెన్ ఫామ్‌లో ఉన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే చైతూ 25వ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ సైతం బలంగా కోరుకుంటున్నారు. గతంలో ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్స్‌ను మిస్ చేసుకున్న చైతన్య.. ఈసారైనా వెంకీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమ బ్యానర్‌లో నాగచైతన్యతో ఒక భారీ సినిమా చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అటు వెంకీ అట్లూరి సైతం సితార బ్యానర్‌తో వరుస ప్రాజెక్టులు చేస్తుండటంతో, చైతూ మైల్‌స్టోన్ ఫిల్మ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ కాంబో నిజంగానే సెట్ అయితే అక్కినేని అభిమానులకు అంతకంటే పెద్ద పండుగ మరొకటి ఉండదు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
రజనీకాంత్ మూవీలో రామ్ పోతినేని.. ఇది ఎవరూ ఊహించలేదు కదా
సొంతూరులో కూరగాయలు అమ్మిన హీరో.. ఏఐ ఫొటోలు కాదండోయ్!
మరోసారి అసూయ చాటుకున్న సిద్ధార్థ్ ఆనంద్!