Naga Chaitanya: ‘తండేల్’కు నాగచైతన్య అవార్డుల హ్యాట్రిక్.. మరో బెస్ట్ యాక్టర్ పురస్కారం!
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:32 PM
అక్కినేని నాగచైతన్యకు ‘తండేల్’ సినిమా మరోసారి అవార్డు తెచ్చిపెట్టింది.
అక్కినేని నాగచైతన్యకు (Naga Chaitanya) ‘తండేల్’ సినిమా మరోసారి అవార్డు తెచ్చిపెట్టింది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తన నటనకు గాను నాగచైతన్య తాజాగా SIIMA అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్ పురస్కారాన్ని అందుకున్నారు. దీంతో ఈ ఏడాది ‘తండేల్’కు సంబంధించి ఆయన ఖాతాలో మూడో బెస్ట్ యాక్టర్ అవార్డు చేరింది. ‘తండేల్’లో రాజు అనే పాత్రలో నాగచైతన్య కనబరిచిన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మలుచుకున్న తీరు కూడా ప్రశంసలు అందుకుంది. ఈ ఏడాది తొలుత తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో నాగచైతన్య ఉత్తమ నటుడిగా నిలిచారు.
ఆ తర్వాత INCA అవార్డ్స్‌లోనూ ఇదే విభాగంలో పురస్కారం అందుకున్నారు. తాజాగా SIIMAలోనూ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కడంతో ‘తండేల్’ చిత్రానికి గాను ఒకే ఏడాదిలో మూడు ఉత్తమ నటుడి పురస్కారాలు సాధించిన ఘనత ఆయన సొంతమైంది.ఈ అవార్డుల హ్యాట్రిక్‌తో నాగచైతన్య అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ‘తండేల్’ తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిందని, ఈ సినిమా ద్వారా నటుడిగా మరోసారి తన సత్తా చాటారని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.ఇక నాగచైతన్య తదుపరి చిత్రాలపై కూడా ఆసక్తి నెలకొంది. ఆయన నటిస్తున్న ‘వృషకర్మ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబరు 4, 2026న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరోవైపు ‘దూత’ ఫ్రాంచైజీ తదుపరి భాగం షూటింగ్‌లోనూ నాగచైతన్య పాల్గొంటున్నారు.