అప్పుడు ఛత్రపతి.. ఇప్పుడు 'వృషకర్మ'

ABN , Publish Date - Nov 26 , 2026 | 07:21 AM

'వృషకర్మ' ఒక కొత్త ఐడియాతో చేసిన చిత్రం. ఇందులో మీరు ఇంతవరకూ చూడని అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుంది' అని కథానాయకుడు నాగచైతన్య అన్నారు.

Vrushakarma

విభిన్న కథలు, సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్న యువ కథానాయకుడు నాగచైతన్య మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం వృషకర్మ (Vrushakarma). ఈ సినిమాపై నాగచైతన్య ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చెబుతున్నారు. దర్శకుడు కార్తిక్ విజన్‌తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, సినిమాలోని ప్రతీ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు. 'వృషకర్మ' తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

నాగ చైతన్య (Naga Chaitanya), మీనాక్షి చౌదరి (meenakshi chaudhary) జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తిక్ వర్మ దండు తెరకెక్కించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. డిసెంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బుధవారం నెల్లూరులో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లోని విజువల్స్, కథాంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా చిత్ర బృందం ప్రయత్నించింది.

ఈ సందర్భంగా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం ఇదే ప్రాంగణంలో ప్రభాస్ నటించిన 'ఛత్రపతి' సినిమా షూటింగ్ చేశామని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు 'వృషకర్మ' ట్రైలర్‌ను కూడా ఇదే ప్రాంగణంలో విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. 'ఛత్రపతి' ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో, 'వృషకర్మ' కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాగచైతన్య కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం, కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో సినిమా రూపొందుతుండటంతో 'వృషకర్మ'పై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి నాగచైతన్య చెబుతున్న ఆ కొత్త విజన్, అద్భుతమైన విజువల్స్ వెండితెరపై ఎలాంటి అనుభూతిని అందిస్తాయో తెలియాలంటే డిసెంబరు 4 వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 26 , 2026 | 07:21 AM