'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్.. కింద పడ్డ నాగచైతన్య! వీడియో వైరల్
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:56 PM
నవయువ సమ్రాట్ నాగచైతన్య తాజా చిత్రం 'వృషకర్మ' గ్లింప్స్ రిలీజయింది. ఈ గ్లింప్స్ రిలీజ్ ఫంక్షన్‌లో చైతూ పొరపాటున కిందపడడం టాక్ ఆఫ్ ద సిటీగా మారింది. ఫ్యాన్స్ ఆందోళన చెందారు. హీరోకు ఏం కాలేదని తెలిసి పాత సంగతులు గుర్తు చేసుకున్నారు అభిమానులు.
నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు (Karthik Dandu) డైరెక్షన్‌లో బీవీయస్.యన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం వృషకర్మ (Vrushakarma). ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ గురువారం రిలీజయింది. హైదరాబాద్ ప్రసాద్ ఐ మాక్స్ థియేటర్‌లో ఈ వేడుక జరిగింది. ఈ మూవీ యూనిట్ మెంబర్స్ స్టేజీపైకి వెళ్ళారు. హీరో నాగచైతన్య కుర్చీలో కూర్చోగానే అది వెనకాలకు ఒరిగిపోయింది. దాంతో నాగచైతన్య కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది చైతూను లేవదీశారు. హీరోకు ఎలాంటి గాయాలు కాలేదు. తరువాత కూడా చైతూ హుషారుగానే మీడియాతో ముచ్చటించడం విశేషం. రిలీజైన 'వృషకర్మ' గ్లింప్స్ ను ఫ్యాన్స్ విశేషంగా వీక్షిస్తున్నారు.
నాగచైతన్య కెరీర్ లో విలక్షణమైన చిత్రంగా 'వృషకర్మ' నిలవనుంది. ఇప్పటిదాకా 'బంగార్రాజు' వంటి కామెడీ ఫాంటసీలో నటించిన నాగచైతన్య మొదటిసారి 'వృషకర్మ' లాంటి హారర్ మిక్స్డ్ జానర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నాయికగా కనిపించనున్నారు. మార్చి 5న మీనాక్షి చౌదరి బర్త్ డే కావడం విశేషం! ఈ సందర్భంగానే 'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్ చేశారని భావించవచ్చు. అయితే ఈ గ్లింప్స్ రిలీజ్ ఫంక్షన్ లో మీనాక్షి పాల్గొనలేదు. ఈ చిత్రానికి బి. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు.
'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్ ఫంక్షన్ లో నాగచైతన్య కుర్చీ మీద నుంచి కిందపడటంపై ఫ్యాన్స్‌లో చర్చ సాగుతోంది. ఏర్పాట్లలో పొరపాటు కారణంగా వేదికలు కూలిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ సదరు ప్రాజెక్ట్స్ పై ఉన్న చెడును తుడిచేసి మంచినే చేశాయనీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. చైతూ తాతయ్య ఏయన్నార్ 'మూగమనసులు' షూటింగ్ సమయంలో హీరోయిన్ సావిత్రి ఏకంగా నదిలోనే జారిపడ్డారు.
యూనిట్ అప్రమత్తంగా ఉండడంతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ సినిమా ఎంతటి బిగ్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే అని అక్కినేని అభిమానులు గుర్తు చేస్తున్నారు. అదే తీరున 'వృషకర్మ' గ్లింప్స్ రిలీజ్ లో చైతూ కిందపడ్డా అది రేపు ఈ సినిమా విజయానికి కారణం కానుందనీ ఫ్యాన్స్ భావన. 'వృషకర్మ' నాగచైతన్యకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూద్దాం.