'ఆదర్శ కుటుంబం'.. రిలీజ్ డేట్ లీక్ చేసిన థమన్
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:38 PM
ఆదర్శ కుటుంబం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో ఇచ్చిన ఒక చిన్న అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.
విక్టరీ వెంకటేష్ (venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas).. ఈ కాంబినేషన్ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకుల్లో ఒక రకమైన మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. గతంలో వెంకీ మామ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు త్రివిక్రమ్ అందించిన మాటలు, కామెడీ ఇప్పటికీ ప్రతి ఇంట్లో మారుమోగుతూనే ఉంటాయి. అలాంటిది, తొలిసారి వెంకటేష్‌ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam) ప్రాజెక్ట్ ప్రకటించిన క్షణం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శ్రీనిధి శెట్టి (srinidhi shetty) కథానాయికగా నటిస్తుండగా, నివేతా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, క్యారెక్టర్ గ్లింప్సెస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే, ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. పోస్ట్-ప్రొడక్షన్, టెక్నికల్ వర్క్స్ పూర్తి కాకపోవడం వల్లే సినిమాను వాయిదా వేస్తున్నామని చిత్రబృందం తెలిపింది. అయితే, కొత్త రిలీజ్ డేట్ ఏంటనేది మాత్రం మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో వెంకీ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో ఇచ్చిన ఒక చిన్న అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ చిత్ర రీ-రికార్డింగ్ పనుల గురించి చెబుతూ థమన్ తన 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
'వెంకీ సర్.. త్రివిక్ సర్.. ఇది సిక్సర్ సర్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఆ పోస్ట్‌లో థమన్ కొత్త రిలీజ్ డేట్‌గా అక్టోబర్ 30 అని పేర్కొన్నారు. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన థమన్ (Thaman S), ఆ పోస్ట్‌ను ఎడిట్ చేసి తేదీని తొలగించారు. కానీ, అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది. నెటిజన్లు ఆ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. పోస్ట్‌లో తేదీని ఎడిట్ చేసినప్పటికీ, అక్టోబర్ నెలను మాత్రం థమన్ అలాగే ఉంచడంతో 'ఆదర్శ కుటుంబం' ఈ నెల 30నే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఫిలింనగర్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. 'ఆదర్శ కుటుంబం' వాయిదా వెనుక కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులే కాకుండా మరికొన్ని బలమైన కారణాలు ఉన్నాయని ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం టెక్నికల్ అలస్యాల వల్ల మాత్రమే కాకుండా, ఫైనల్ అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం కొంత అసంతృప్తితో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పక్కా ప్లానింగ్‌తో వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట. తొందరపడి సినిమాను థియేటర్లలోకి తెచ్చి నిరాశపరచడం కంటే, కొంచెం ఆలస్యమైనా సరే ఫ్యాన్స్‌కు ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ హిట్ ఇవ్వాలని టీమ్ నిర్ణయించుకుందట. ఏదేమైనా.. థమన్ లీక్ చేసినట్టుగా 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 30నే థియేటర్లలోకి వస్తుందా? లేక మేకర్స్ మరేదైనా కొత్త తేదీని ప్రకటిస్తారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.