MS. Subbalakshmi: ఆ వార్తలు అబద్దం.. సాయి పల్లవి తప్పా మరెవరూ ఆ పాత్ర చేయలేరు
ABN , Publish Date - Apr 27 , 2026 | 10:25 PM
కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి Ms సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సన్నాహాలు చేస్తోంది.
కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి (MS. Subbalakshmi) జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) సన్నాహాలు చేస్తోంది. అయితే, గత కొద్దిరోజులుగా ఈ సినిమాలో సుబ్బలక్ష్మి పాత్రలో నటించాల్సిన సాయి పల్లవి (Sai Pallavi) తప్పుకుందని, ఆ స్థానంలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) వచ్చిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. సాయి పల్లవి ఇప్పటికే పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేశాయి.
అయితే ఈ రూమర్లపై మేకర్స్ పక్కా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుబ్బులక్ష్మి పాత్రకు సాయి పల్లవిని మార్చామనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఆమెను తప్ప మరో నటిని ఆ పాత్రలో ఊహించుకోలేమని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ ఐకానిక్ పాత్రకు సాయి పల్లవి నూటికి నూరు శాతం న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. రుక్మిణీ వసంత్ ఎంపిక కేవలం ఒక పుకారు మాత్రమేనని, ఆ వార్తలను నమ్మవద్దని తేల్చి చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుతం సాయి పల్లవి 'రామాయణ', 'కల్కి 2', మరియు మణిరత్నం చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ బయోపిక్ షూటింగ్ కాస్త ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఏడాది అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కేవలం డేట్స్ కోసమే వేచి చూస్తున్నామని, పాత్ర కోసం సాయి పల్లవి ఇప్పటికే కర్ణాటక సంగీతంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. నటనలో జీవించే సాయి పల్లవి, సంగీత విద్వాంసురాలిగా మారేందుకు పడుతున్న శ్రమ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఇక ఈ చిత్రానికి సాంకేతిక బలం కూడా తోడవ్వడం విశేషం. 'జెర్సీ' వంటి క్లాసిక్ సినిమాతో ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) ఈ బయోపిక్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. భావోద్వేగాలను పండించడంలో ఆయనకున్న నేర్పు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే, యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు.
ఒక గొప్ప సంగీత విద్వాంసురాలి కథ కావడంతో, మ్యూజిక్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది. అనిరుధ్ వంటి ఆధునిక సంగీత దర్శకుడు క్లాసికల్ నేపథ్యంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గౌతమ్ మేకింగ్, అనిరుధ్ సంగీతం, సాయి పల్లవి నటన కలిసి ఈ సినిమాను భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలబెట్టడం ఖాయమనిపిస్తోంది.