ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ‘అగధ'

ABN , Publish Date - Apr 15 , 2026 | 11:10 AM

ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు తెరకెక్కించిన తాజా చిత్రం 'అగధ'. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

MS Raju

సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఎం. ఎస్. రాజు నిర్మించిన 'శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తదితర చిత్రాలు ట్రెండ్ సృష్టించాయి. దర్శకునిగా కూడా ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. 'డర్టీ హరి', 'మళ్లీ పెళ్లి' చిత్రాలు అందుకు నిదర్శనాలు. ఒకసారి చేసిన కాన్సెప్ట్‌ని మళ్లీ మళ్లీ అనుసరించటం ఆయనకు ఇష్టం ఉండదు. ఏం చేసినా ప్రేక్షకులకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నదే ఎం.ఎస్‌. రాజు ఆలోచన. అందుకోసమే ఆయన 'అగధ'ను సిద్ధం చేస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన ఈ ప్రాజెక్టు మీదనే అహరహం శ్రమిస్తున్నారు. తాజాగా 'అగధ' ప్రమోషన్స్ విభిన్నంగా మొదలుపెట్టారు ఎం.ఎస్‌. రాజు. ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోను ఇటీవల ఆయన విడుదల చేశారు. ఇద్దరు దొంగలు ఎమ్మెస్ రాజు ఆఫీసులో దొంగతనానికి వెళ్లడం, అక్కడున్న సినిమా పోస్టర్స్ ని చూస్తూ ఆ దొంగలు ఆ సినిమా జ్ఞాపకాలను తలుచుకోవడం, చివరగా ఒక పోస్టర్‌ని చూసి అక్కడ ఏదో ఉందని భయపడటంతో ఆ వీడియో ఎండ్ అవుతుంది. తీరా అక్కడ ఉన్నది 'అగధ' సినిమా పోస్టర్. ఆ పోస్టర్‌ను బుధవారం ఎం.ఎస్. రాజు విడుదల చేశారు.


ఒక చీకటి గుహ. చుట్టూ వెలుగుతోన్న కొన్ని కాగడాలు. చీకటే కాదు ఆ సన్నని వెలుతురు కూడా భయానకంగా ఉంది. అక్కడ ఒక భారీ విగ్రహం. మొహమంతా మిస్టిక్ గా ఉంది. ఆ విగ్రహానికి 12 చేతులు. ఈ విగ్రహం ముందు … వెనుతిరిగి ఉన్న ఒకమ్మాయి . ఆమె వేషధారణ కూడా చాలా విభిన్నంగా ఉంది. ఈ పోస్టర్ తోనే ఒక ఆసక్తిని జనరేట్ చేశారు ఎమ్మెస్ రాజు. మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌గా 'అగధ'ను ఆయన రూపొందిస్తున్నారు.

WhatsApp Image 2026-04-15 at 10.30.14 AM.jpeg

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై 'అగధ' చిత్రాన్ని కాశీ విశాలాక్షి బలుసు చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న 'అగధ' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం గురించి ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ 'ఇదొక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. ఇందులో నటించిన తారలు ఎవరనేది త్వరలో తెలియజేస్తాం. రకరకాల సెట్లు, విభిన్న లొకేషన్లలో 85 రోజులు షూటింగ్ చేశాం. ఈ సినిమాలో 45 నిమిషాల వి.ఎఫ్.ఎక్స్. ఉంటుంది. దాన్నిబట్టే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, ఎడిటర్: జునైద్ సిద్దిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, అడిషనల్ స్క్రీన్ ప్లే: చైతన్య వేగి , ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. వి. ఎన్. సుబ్బరాజ్.

Updated Date - Apr 15 , 2026 | 11:11 AM