కుటుంబ సమేతంగా చూసే వినోదాత్మక చిత్రం.. 'మిస్టర్ మిడిల్ క్లాస్'
ABN , Publish Date - Jul 19 , 2026 | 05:48 PM
శ్రీకాంత్, లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
శ్రీకాంత్, లయ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాకు మంచి ఆదరణ చూపిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
సినిమాలో హీరోకు శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ముడిపడిన భావోద్వేగ ఘట్టాలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు వినోదానికి పెద్దపీట వేసిన కామెడీ ట్రాక్ ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తోంది. భావోద్వేగం, హాస్యం సమతుల్యంగా ఉండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మధ్యతరగతి కుటుంబాల ఆశలు, కష్టాలు, అనుబంధాలను దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి హృద్యంగా ఆవిష్కరించారు. శ్రీకాంత్ తన పాత్రలో సహజమైన నటన కనబరిచగా, లయ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించి ప్రేక్షకులను మెప్పించారు. సాయి కార్తీక్ అందించిన సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత బలంగా నిలబెట్టింది. సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, అలీ తదితరులు తమ కామెడీ టైమింగ్‌తో వినోదాన్ని మరింత పెంచారు.
నిర్మాతలు చందు నూతి, జీకే ఈ చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. విజువల్ క్వాలిటీ నుంచి సాంకేతిక అంశాల వరకు ప్రతి విషయంలో నాణ్యత కనిపించేలా శ్రద్ధ తీసుకున్నట్లు సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.