రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా.. సుకుమార్ అంత ప‌ని చేస్తాడా!

ABN , Publish Date - May 29 , 2026 | 05:47 AM

దర్శకుడు సుకుమార్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలయిక అనగానే టాలీవుడ్‌లో ఒక తిరుగులేని సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ గుర్తొస్తుంది.

sukumar

ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Ram Charan), రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కలయిక అనగానే టాలీవుడ్‌లో ఒక తిరుగులేని సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ గుర్తొస్తుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఆర్య', 'జగడం', 'ఆర్య-2', '1: నేనొక్కడినే', 'రంగస్థలం', 'పుష్ప', పుష్ప-2 వంటి చిత్రాలు సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనాలు సృష్టించాయి. సుకుమార్ రాసే విలక్షణమైన పాత్రలకు, వినూత్నమైన కథాంశాలకు దేవి శ్రీ ప్రసాద్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్యాచీ ట్యూన్స్‌తో సంపూర్ణంగా ప్రాణం పోస్తారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న నమ్మకమే దాదాపు ఇరవై ఏళ్లకు పైగా వీరిని టాలీవుడ్‌లోనే అత్యంత క్రేజీయెస్ట్ జోడీగా నిలబెట్టింది. సుకుమార్ తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా వేరే సంగీత దర్శకుడితో పని చేయకపోవడం వీరి బంధానికి నిదర్శనం.

ఇలాంటి అప్రతిహత ప్రయాణంలో ఎన్నడూ లేని విధంగా ‘పుష్ప-2’ సమయంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, సుకుమార్ ప్రత్యామ్నాయంగా వేరే మ్యూజిక్ డైరెక్టర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ పరిణామం దేవి శ్రీ ప్రసాద్‌ను తీవ్రంగా కలచివేసింది, ఆ అసంతృప్తిని ఆయన ఒక సినిమా వేడుక వేదికపైనే బహిరంగంగా ప్రదర్శించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య సడలిపోయిన సంబంధాలు మళ్లీ సర్దుకున్నట్లు కనిపించినప్పటికీ, భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.

ప్రస్తుతం సుకుమార్ తర్వాతి సినిమా విషయంలో ఏం జరగబోతోందనే అంశంపై పరిశ్రమలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రూపొందించబోయే తర్వాతి చిత్రానికి సంగీత దర్శకుడు మారబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు దేవి శ్రీ ప్రసాద్ తన కెరీర్‌లో తొలిసారిగా హీరోగా మారుతూ ‘యల్లమ్మ’ అనే సినిమా చేస్తుండటం విశేషం. నటనపై దృష్టి పెట్టడం వల్లే ఆయన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించలేకపోయారని, ఆ బాధ్యతలను థమన్ స్వీకరించారని టాక్ నడుస్తోంది.

ఒకవైపు దేవి సంగీతంలో పాత సృజనాత్మకత తగ్గుతోందనే విమర్శలు వ్యక్తమవుతుండగా, ఇంకోవైపు ఆయన నటన వైపు అడుగులు వేయడం సంగీత దర్శకుడిగా ఆయన భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. గతంలో దేవి శ్రీ ప్రసాద్‌తో వరుసగా పనిచేసిన ఎందరో స్టార్ డైరెక్టర్లు కాలక్రమేణా ఆయనకు దూరం జరిగారు. అయినప్పటికీ సుకుమార్ మాత్రం దేవిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఒకవేళ ఇప్పుడు సుకుమార్ కూడా తన తర్వాతి సినిమాకు వేరే ఆప్షన్‌ను ఎంచుకుంటే, దేవి హవా టాలీవుడ్‌లో ముగిసిపోయిందనే భావన అందరిలోనూ మరింత బలంగా నాటుకుపోయే ప్రమాదం ఉంది.

కానీ ఈ ప్రచారాల వెనుక ఉన్న అసలు వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంది. రామ్ చరణ్ (Ram Charan) సినిమాకు సంబంధించి సుకుమార్ ఏ టెక్నీషియన్‌ను తీసుకోవాలనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి కథను లాక్ చేశారే తప్ప, పూర్తి స్థాయి స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాలేదు. దీనికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా పూర్తయిన తర్వాతే సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది.

ఆ సమయానికి దేవి శ్రీ ప్రసాద్ డేట్స్ ఎంతవరకు అందుబాటులో ఉంటాయి. ఈ కథకు ఆయన కాకుండా వేరెవరైనా న్యాయం చేయగలరా అనే కోణాల్లో సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతే సుకుమార్ తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆత్మీయ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడకతప్పదు.

Updated Date - May 29 , 2026 | 02:13 PM