ఎం4ఎం సీక్వెల్.. 'కిల్లర్ గేమ్స్' ది గేమ్ బిగిన్స్ నౌ
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:53 PM
ఇండో - అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం' .
ఇండో - అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం' (Motive For Murder)’ మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఇటీవలే మూవీ 60 రోజుల విజయోత్సవాన్ని జూలై 18, 2026న శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సినీ లౌంజ్‌లో ఘనంగా నిర్వహించగా.. ఈ వేడుకలో దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ Jo Sharma కలిసి 'M4M-2' సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు.
అయితే.. తాజాగా ఈ సీక్వెల్ 2 ప్రారంభమవగా సినిమాకు కిల్లర్ గేమ్స్.. ది గేమ్ బిగిన్స్ నౌ అనే పేరును ఖరారు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో సైతం విడుదల చేశారు. తొలి భాగం విజయాన్ని మించి సీక్వెల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది. 'కిల్లర్ గేమ్స్' చిత్రాన్ని టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో రూపొందించనున్నట్లు వెల్లడించింది. సినిమా షూటింగ్‌ను భారత్‌తో పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. త్వరలోనే నటీనటుల ఎంపిక కోసం ఆడిషన్స్ ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

మరింత ఉత్కంఠభరితంగా సీక్వెల్
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, 'ఎం4ఎం'కు ప్రేక్షకులు అందించిన ఆదరణే ఈ విజయానికి కారణమని చెప్పారు. సినిమా ప్రేమికులు, నటీనటులు, సాంకేతిక బృందం, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, మీడియా అందించిన సహకారం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆయన తెలిపారు. అలాగే 'ఎం4ఎం-2'లో కథను మరింత ఉత్కంఠభరితంగా, అనూహ్యమైన మలుపులతో, భారీ నిర్మాణ విలువలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
మొదటి భాగంలో తన నటనతో ప్రశంసలు అందుకున్న ఈచిత్ర హీరోయిన్ Jo Sharma మాట్లాడుతూ, ప్రేక్షకులు చూపించిన ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సీక్వెల్‌లో మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నానని, ప్రేక్షకులకు మరోసారి థ్రిల్లింగ్ సినీ అనుభూతిని అందించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.
