మౌళి.. దొంగ నా కొడుకు

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:05 PM

యంగ్ డైరెక్టర్ శ్రీను కంబాల దర్శకత్వంలో మౌళి హీరోగా నటిస్తోన్న చిత్రం దొంగనాకొడుకు. ఈ చిత్రంలో మౌళి సరసన సుస్మితా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

Donga Naa Koduku

సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, డిజిటల్ కంటెంట్ ద్వారా యూత్‌లో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న మౌళి (Mouli) నటుడిగా తన ప్రయాణాన్ని చాలా గ్రాండ్‌గా ప్రారంభించిన విషయం తెల్సిందే. లిటిల్ హార్ట్స్ (Little Hearts) సినిమా ద్వారా హీరోగా పరిచయమై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన ఘనవిజయంతో మౌళి టాలీవుడ్‌లో సరికొత్త ల్యాండ్‌మార్క్ క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమా తరువాతవచ్చిన ప్రతి కథను ఓకే చేయకుండా మంచి మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.


మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న మౌళి, ఇప్పుడు తన రెండవ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేస్తుండటం విశేషం. యంగ్ డైరెక్టర్ శ్రీను కంబాల దర్శకత్వంలో మౌళి హీరోగా నటిస్తోన్న చిత్రం దొంగనాకొడుకు. ఈ చిత్రంలో మౌళి సరసన సుస్మితా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ రాబరీ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


తాజాగా దొంగ నా కొడుకు టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్ గురించి మౌళి ఎక్స్ ద్వారా చెప్పుకొచ్చాడు. 'ఈసారి కామెడీతో పాటు ట్విస్టులు కూడా చాలా. టైటిల్ కొంచెం కమర్షియల్ గా అనిపించవచ్చు. కానీ, నన్ను నమ్మండి. సినిమాలో చాలా ఉన్నాయి. త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం' అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో మౌళి ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Aug 03 , 2026 | 06:05 PM